కర్ణాటక శాసనమండలిలో అరాచకం.. చైర్మన్ ను సీట్ లోంచి లాగి బయటకు తోసేసిన సభ్యులు
posted on Dec 15, 2020 11:29AM
కర్ణాటక శాసనమండలి సమావేశాలలో ఈరోజు తీవ్ర కలకలం రేగింది. శాసన మండలిలోనే సభ్యులు బాహాబాహీకి దిగారు. దీంతో అసలు శాసన మండలిలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసి అక్రమంగా ఒకరిని ఛైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు సభ్యులు గొడవపడడం కలకలం రేపుతోంది. దీంతో కొందరు సభ్యులను మరికొందరు సభ్యులు బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో శాసన మండలి ఛైర్మన్ ను కుర్చీలోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను బలవంతంగా బయటకు పంపించారు. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. శాసన మండలిలో అధికార బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.