రజనీకాంత్ పార్టీ గుర్తు ఇదే..! 

తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు కావడంతో ఆయన పార్టీ పేరు, గుర్తుపై అటు తలైవా అభిమానుల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పార్టీకి తాజాగా "మక్కల్ సేవై కట్చి" (ప్రజాసేవ పార్టీ) అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక పార్టీ గుర్తు విషయానికి వస్తే ఆయన నటించిన పాపులర్ చిత్రాల్లోని రజనీ స్టయిల్స్‌కు దగ్గరగా ఉండే గుర్తులను ఆ పార్టీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2015లో విడుదలైన 'బాబా' చిత్రంలో రజినీకాంత్ "టూ ఫింగర్" ఫోజ్‌ అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే దీనికి ముందు 1995లో వచ్చిన "బాషా" లో ఆటోడ్రైవర్‌గా కనిపించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే "టూ ఫింగర్", లేదంటే "ఆటో" గుర్తుల్లో ఏదో ఒక దానిని దక్కించుకోవాలని ఆ పార్టీ ఆశిస్తున్నట్టుగా సమాచారం. అయితే, ఈ రెండిట్లో రజినీ కొత్త పార్టీకి "ఆటో" గుర్తు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలోనూ పోటీ పడాలని రజనీ ఇప్పటికే ప్లాన్‌గా కనిపిస్తోంది. దీంతో కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరిలో పార్టీని పెడుతున్నట్టు డిసెంబర్ 8న రజినీకాంత్ ప్రకటించారు.

 

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా విజయం సాధిస్తాం. నిజాయితీ, పారదర్శకత, అవినీతి రహిత, కుల, మతాలతో ప్రమేయం లేని ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తాం అని రజినీ కాంత్ ఇటీవల ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే అధికార అన్నాడీఎం బీజేపీతో పొత్తుతో 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఈసారి కూడా కొననసాగనుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ ఎన్నికలకు ముందే జైలు నుంచి విడుదల కానున్నందున రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతాయో అనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. మరోపక్క ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే "మక్కల్ నీది మయ్యం" పార్టీ పెట్టి ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టేశారు. తాజా సమాచారం ప్రకారం కమల్ లాంచ్ చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీతో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu