మోడీ ఇమేజ్ ముంచేస్తుంది జాగ్రత్త!

బీజేపీ డబుల్ ఇంజిన పవర్ అంటూ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంటే ప్రగతి స్పీడందుకుంటుందని ఊదరగొట్టేస్తోంది. పేరుకు డబుల్ ఇంజిన్ అంటున్నా కేంద్రం ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు మనుగడ సాగిస్తున్నది మోడీ ఇమేజ్ తోనే అని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కర్నాటక ఎన్నికలలో పరాభవం ఎదురయ్యే వరకూ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరికీ మోడీ మ్యాజిక్ పై వీసమెత్తు అనుమానం కూడా రాలేదు.

అయితే కర్నాటక ఫలితాల తరువాత ‘మోడీ’ ఇమేజ్ పైనే ఆధారపడి సార్వత్రిక ఎన్నికలకు వెడితే మునిగిపోవడం ఖాయమన్న భయం బీజేపీలో మొదలైంది. ఆ భయం ఆ పార్టీ మెంటార్ ఆర్ఎస్సెస్ వరకూ చేరింది. దీంతో ఇంత కాలం మౌనంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీకి సుద్దులు చెప్పడం మొదలెట్టేసింది. కర్నాటక ఫలితాలను ఉటంకిస్తూ.. కేవలం మోడీ ఇమేజ్ బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కించే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేసింది. కర్నాటక ఫలితాల తరువాత పార్టీలో మోడీ వ్యతిరేక గొంతులు సవరించుకుంటున్నాయి. వాటికి ఆర్ఎస్ఎస్ అండ లభిస్తోందన్న అనుమానాలు కూడా పార్టీలో వ్యక్తమౌతున్నాయి. పార్టీలో మోడీ వ్యతిరేక గళం అనగానే మొదటిగా ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు గడ్కరీ. 

ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో  2018లోనే మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ధైర్యంగా పార్టీ పవర్ సెంటర్ నే ప్రశ్నించారు. నాగపూర్ ఆశీస్సులతోనే గడ్కరీ అంత ఘాటు విమర్శలు చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. అయితే అప్పడు గడ్కరీకి ఆర్ఎస్ఎస్ ఏ మాత్రం అండగా నిలవలేదు. కానీ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా అప్పట్లో గట్టిగా గళమెత్తడంతో మోడీకి ఆయనే ప్రత్యామ్నాయమన్న చర్చ కూడా జరిగింది. ఇంతకీ అప్పుడు ఆయన ఏమన్నారంటే.. 2014 ఎన్నికలలో బీజేపీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.  ఎందుకంటే అప్పుడు అధికారంకి రాగలమన్న నమ్మకం బీజేపీలో లేదు. అందుకే ప్రజాకర్షక హామీలను గుమ్మరించేయమని పార్టీ హైకమాండ్ నిర్దేశించింది.  సరే అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు నాడు మేం ఇచ్చిన హామీలను నెరవేర్చమని జనం డిమాండ్ చేస్తున్నారు.  మేం నవ్వి ఊరుకుంటున్నామని అప్పట్లోనే గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నికలలో విజయం కోసమే హామీలిచ్చాం కానీ వాటిని నెరవేర్చాలన్న ఉద్దేశమే లేదని కుండబద్దలు కొట్టేశారు.

అయితే ఆ తరువాత ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ఆయన నాగపూర్ సంబంధాలు కూడా దానిని ఆపలేకపోయాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని కూడా కోల్పోయారు. 2019 ఎన్నికలలో కూడా మోడీ ఫేస్ బీజేపీని గెలిపించడంతో పార్టీలో, ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర నామమాత్రమైపోయింది. కేంద్ర మంత్రిగా ఉత్సవ విగ్రహంగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఇప్పడు 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ ఇమేజ్ మసకబారుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ సారి ఆర్ఎస్ఎస్ ఘాటు వ్యాఖ్యలే చేసింది. మోడీ ఇమేజ్ ని మాత్రమే నమ్ముకుంటే మునక ఖాయమని హెచ్చరించింది. బీజేపీ మెంటార్ గా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను డబుల్ ఇంజిన్ లెక్క చేసినా చేయకపోయినా బీజేపీ క్యాడర్ కచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుందన్నది పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలోనే మరోసారి అందరి దృష్టీ గడ్కరీ వైపు మళ్లింది. ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి ఫలితాలు బీజేపీలో మోడీ భవిష్యత్ కు లిట్మస్ టెస్ట్ గా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పు తెలుసుకుని బీజేపీ కనుక తన దారిని మార్చుకుని బీజేపీ లో సమష్టి నాయకత్వానికి పెద్ద పీట వేయడం లోకల్ లీడర్ షిప్  ని డెవలప్ చేయడం కేవలం హిందూత్వనే పట్టుకోకుండా మొత్తంగా ప్రజల కు అవసరం అయిన వాటిని అందిపుచ్చుకుని వాటి మీద పనిచేయడం మొదలు పెట్టాలని సూచించింది. మెంటార్ సూచనలను డబుల్ ఇంజిన్ పట్టించుకుంటుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.