విజయసాయికి చేయడానికి పనేది?

విజయసాయి రెడ్డి.. చాలా కాలం తరువాత అమరావతిలో  వైపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పడు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిల్స్ లోనూ ఓ రేంజ్ లో  చర్చకు తావిచ్చాయి. అంతే కాదు.. విజయసాయి నిజం చెప్పేశారంటూ సోషల్ మీడియాలో ఆయన మాటలు తెగ ట్రోల్ అవుతున్నాయి. ఇంతకీ విజయసాయి కొత్తగా ఏమీ చెప్పలేదు.

 రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు ఏం చేప్పారో.. విజయసాయి ఇప్పుడు అదే విషయాన్ని అనుబంధ సంఘాలకు చెప్పారు. నాలుగేళ్లుగా రిలాక్స్ డ్ గా ఉన్నారు. పని చేయకుండా పబ్బం గడిపేసుకున్నారు. ఇక ఈ తొమ్మిది నెలలైనా పని చేయండంటూ విజయసాయి అనుబంధ సంఘాల సమావేశంలో చెప్పారు.  బలే కోయిన్సిడెన్స్ అంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే కాదు.. పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఈ నాలుగేళ్లు అధికారం, పెత్తనం చెలాయించేస్తూ గడిపేశారనీ, ఇక ఎన్నికలకు తొమ్మిది నెలలో మిగిలి ఉండటంతో పని చేయండ అని మంత్రులను సీఎం బతిమలాడుకుంటుంటే.. విజయసాయి తాను ఇన్ చార్జ్ గా ఉన్న పార్టీ అనుబంధ సంఘాలను బతిమలాడుకుంటున్నారు. ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు.. ఇక నుంచి 24 గంటలూ పార్టీ కోసం పని చేయాలని ఆయన వైసీపీ విద్యార్థి, యువత, మహిళా విభాగాలకు దిశా నిర్దేశం చేశారు.  

విజయసాయి అంటే ఇటీవల అయితే పార్టీలో అనామకుడిగా మిగిలిపోయారు కానీ, వైసీపీ ఆవిర్బావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన నేత. సలహాదారు అన్న పదవి లేదు కానీ, ప్రస్తుతం సజ్జల అనుభవించిన హోదాను, ఆధిపత్యాన్నీ పార్టీలో విజయసాయి అనుభవించారు. ఆయన మాటే వేదవాక్కుగా పార్టీ పై నుంచి కింది వరకూ అందరూ శిరసావహించేవారు. అలాంటి విజయసాయికి పదవులన్నీ పీకేసి కేవలం అనుబంధ సంఘాల ఇన్ చార్జి పదవిని నామమాత్రంగా మిగిల్చింది పార్టీ. మళ్లీ ఇక్కడ కూడా ఆయన అధికారాలు అంతంత మాత్రమే. పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జ్ లందరూ సజ్జల కంట్రోల్ లో ఉంటారు.

ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను ఈ అనుబంధ సంఘాలకు సంబంధం లేకుండా సజ్జల కుమారుడు మానిటర్ చేస్తున్నారు. అంటే అలంకారప్రాయమైన పదవిలో ఉన్న విజయసాయి.. అనుబంధ సంఘాల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు ఇక పని చేయండంటూ దిశానిర్దేశం చేయడం వెనుక ఆయన ఉద్దేశమేమిటని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను సజ్జల కుమారుడి చేతికి పార్టీ అధినేత అప్పగించిన తరువాత పార్టీలో విజయసాయికి పనే లేకుండా పోయింది. ఇంత కాలం ఆయన హస్తినకు పరిమితమై.. మౌనాన్ని ఆశ్రయించారు.

చంద్రబాబు జన్మదినానికి ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం, మెడీని పొగుడుతూ పోస్టులు పెట్టడం వినా ఆయన ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కనిపించలేదు కూడా. ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ వర్గాలనే విస్మయపరిచినట్లుంది. చేయడానికి పార్టీలో ఆయనకే ఏ పనీ లేదు.. ఇక ఆయన చెబితే అనుబంధ సంఘాలు వింటాయా? ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వైసీసీ వర్గాలలోనే  వ్యక్తమౌతున్నాయి.