వైఎస్ బ్రాండ్ కు అవినాష్ గండం

తెలుగు రాజకీయాలను మ ూడు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఎదుగురి సందింటి రాజశేఖరరెడ్డి వైఎస్ఆర్ గా ప్రసిద్ధులు. 1978లో తొలి సారి అసెంబ్లీ మెట్లు ఎక్కిన రాజశేఖరరెడ్డి అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా  రెండు సార్లు పని చేశారు. తెలుగు రాజకీయాలలో వైఎస్ఆర్ ఒక పెద్ద బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మసక బారింది.  

తమ్ముడి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి, తన కొడుకు వైఎస్ జగన్ లు పదవులతో ప్రత్యక్ష  రాజకీయాలలో ఉండగా భార్య వైఎస్ విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలలు రాజకీయాల్లో పని చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరిలో వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ఆర్ మరణానంతరం పులివెందుల అసెంబ్లీ  స్థానం నుంచి గెలుపొంది తదననంతరం కుమారుడు ప్రారంభించిన వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగారు. అనంతర పరిణామాలలో ఆమె ఆ  పదవిని కూడా  త్యాగం చేయాల్సి వచ్చింది.  సెప్టెంబరు 2, 2009న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన తరువాత ఆయన బ్రాండ్ ఇమేజ్ ను వాడుకునేందుకు జగన్ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైసీపీ పేరుతో ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల విభజన తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జగన్ మరో ఐదేళ్లు వేచి ఉండక తప్పలేదు. ఈ ఐదేళ్లలో వైఎస్ బ్రాండ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు జగన్ కుటుంబం కష్టపడింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ప్రతి గ్రామంలో , ప్రతిపట్టణ, నగర కూడళ్లలో వైఎస్ఆర్ విగ్రహాలు వెలిశాయి. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ విగ్రహాల సంఖ్య 20 వేలు దాటింది. 

ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహాత్మాగాంధీ, బీఆర్ అండేడ్కర్, నెహ్రూ వంటి జాతీయ నేతల విగ్రహాల కన్నా చాలా ఎక్కువ. ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకున్న వైఎస్ బ్రాండ్ 2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఒక్క సారిగా పాతాళానికి దిగిపోయింది.  కడప జిల్లాలో వైఎస్ వంశీయుల అనుమతి లేకుండా గాలి కూడా ఒక వైపు నుంచి మరో వైపుకు వీచదు అంటూ చెప్పుకుంటారు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి స్వంత తమ్ముడిని  పులివెందులలో ఆయన స్వంత ఇంట్లో అత్యంత దారుణంగా నరికి చంపడంతో  కడప జిల్లా ఉలిక్కిపడింది.

తొలుత వివేకా మరణం గుండెపోటుతో6 జరిగిందన్న అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు వైఎస్ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  వివేకా కూతురు స్వతహాగా డాక్టర్ కావడంతో ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు వైఎస్ కుటుంబం  దగ్గర సమాధానాలు దొరకలేదు. పులివెందులలో వైఎస్ పెద్దయనగా పెరు సంపాదించిన వివేకా హత్యతో అవినాష్ పై కడప వాసులు కోపం పెంచుకున్నారు. గత కొంత కాలంగా హైకోర్టు, సుప్రీం కోర్టు, సీబీఐ ఇంటరాగేషన్ తో వైఎస్ బ్రాండ్ కు బీటలు వారాయి. వైఎస్ విజయలక్ష్మిని పార్టీ నుంచి సాగనంపి, వైఎస్ షర్మిలను తెలంగాణకు పరిమితం చేయడంతో కడప ప్రజలు జగన్ పై గుర్రుగా ఉన్నారు.

వివేకా హత్య కేసులో తమ్ముడిని వెనకేసుకు రావడం కూడా కడప వాసులకు నచ్చడం లేదు. ఇప్పటికి 11 సీబీఐ కేసులలో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్ పై ఉన్న సానుభూతి ఇప్పడు కనబడడం లేదు. వైఎస్ కుటుంబ కంచుకోటగా  పేరున్న కడపలోనే బ్రాండ్ డామేజి అవుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడపలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ యువగళం ద్వారా జగన్ పాలనను తూర్పారపడుతున్నారు. ఏది ఏమైనా రాజశేఖరరెడ్డి పెంచుకున్న వైఎస్ బ్రాండ్ కు గడ్డు రోజులు వచ్చాయని చెప్పక తప్పదు.