మోడీకి ఆర్ఎస్ఎస్ ఎసరు?

ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ మెంటార్ గా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎసరు పెడుతోందా?  బీజేపీలో, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ వ్యక్తిపూజ పీక్స్ చేరిందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆయన పదవి దిగిపోవాలని కోరుకుంటోందా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు, ఆ తరువాత దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి కొనసాగుతున్న ప్రధాని మోడీని ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందేననీ, ఆ టైమ్ ఇచ్చేసిందనీ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తుండటం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు. వచ్చే సెప్టెంబర్ తో ప్రధాని మోడీకి 75 ఏళ్లు వస్తాయి.  ప్రధాని మోడీ హవా బీజేపీలో మొదలైన తరువాత ఆయనే 75 ఏళ్ల వయస్సు నిబంధనను తీసుకువచ్చారని చెప్పాలి. 75 సంవత్సరాలు వచ్చిన  వారెవరూ పార్టీ, ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా నిబంధన విధించారు. ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నిబంధన పరిధిలోకి వస్తున్నారు. ఇక్కడ వయస్సు నిబంధన విషయంలో మోడీకి మినహాయింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం మోడీకి వయస్సు గురించి గుర్తు చేస్తూ వారసుడి అన్వేషణ అనివార్యం అని హెచ్చరిక లాంటి సూచన చేస్తోంది.   ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్‌భ‌గ‌వ‌త్‌.. ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని  ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఆయన వయస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీకి ఓ హెచ్చరికేనని అంటున్నారు.  

స్థాయితో సంబంధం లేకుండా నాయకుడనే వారు ఎవరైనా సరే నిబంధనలు పాటించి తీరాలి. అలా పాటించకపోతే అసలు నిబంధనలు ఎందుకు? అంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ ప్రధానిగా కొనసాగే విషయంలో ఆయన విస్పష్టంగా తన అభ్యంతరాన్ని చెప్పినట్లుగానే ఉన్నాయి. 75 ఏళ్లు వచ్చిన తరువాత ఎవరైనా సరే తమ పదవులు త్యాగం చేయాల్సిందేనని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. దీంతో    న‌రేంద్ర మోడీ ప్రధాని పదవిలో కొనసాగడంపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ తో ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులు కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.

ఇదేస‌మ‌యంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌గా ఉన్న మోహ‌న్‌భ‌గ‌వ‌త్ కూడా అదే నెల‌లో ప‌ద‌వీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబ‌రు నాటికి ఆయ‌న మోడీ కంటే కూడా.. ముందే 75వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు. దీంతో ముందు ఆయ‌న రిజై న్ చేసి..కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. ప్ర‌ధాని మోడీకి కూడా తాను తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుందని అంటున్నారు.  కానీ..  బీజేపీని మూడుసార్లు వ‌రుస‌గా అధికారంలోకి తెచ్చిన నాయ‌కుడిగా మోడీ పదవి నుంచి తప్పుకోవడానికి బీజేపీ అంగీకరిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ప్ర‌పంచ దేశాల‌కు కూడా ‘విశ్వ‌గురు’గా గుర్తింపు పొందిన మోడీ.. ఇప్పటి కిప్పుడు అధికారం నుంచి దిగితే? ఎలా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.   ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, వ‌న్ నేష‌న్‌-వన్.. ఇలా దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సాధించాలని ప్రయత్నిస్తున్న లక్ష్యాలను మోడీ తనహయాంలో సాధించి చూపారు.  ఈ నేపథ్యంలో మోడీకి దిగిపోవాలంటూ  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్ష హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మోడీకి సన్నిహితుడు.. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు కుడి భుజంగా ఉంటూ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను ప్రధాని రేసులో లేనని విస్పష్టంగా చెప్పేశారు. తాను రాజకీయ రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో మోడీని కొనసాగించడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడే ఆ పార్టీకి గట్టి చిక్కు వచ్చి పడింది. బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వారి విషయంలో మోడీషా ద్వయం అనుసరించిన విధానంపై బీజేపీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి నాయకుల విషయంలో వయస్సు నిబంధనను కఠినంగా అమలు చేసి వారిని రాజకీయాలకు దూరం చేసిన తీరు పట్ల జనసామాన్యంలో కూడా ఒకింత అసహనం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ కూడా స్టెప్ డౌన్ అయి.. వయస్సు నిబంధన అన్నది తనకు కూడా వర్తిస్తుందని రుజువు చేసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద 75 ఏళ్ల వయస్సు నిబంధన ఇప్పుడు మోడీ విషయంలో అమలు అవుతుందా? లేదా అన్న ఉత్కంఠ దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.