ఆ ఒక్కటీ తప్ప అన్నిటికి ఒకే?

 

పార్లమెంటు సమావేశాలు మొదలయి రెండు వారాలు పూర్తికావస్తున్నా కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన 36 బిల్లులలో ఇంతవరకు ఒక్క బిల్లును కూడా ఆమోదించలేదు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల మళ్లింపు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిని కేసులో విచారణకు స్వయంగా హాజరుకమ్మని పాటియాలా కోర్టు ఆదేశించడంతో, మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు పార్లమెంటుని స్తంభింపజేస్తుండటంతో ఇంతవరకు ఒక్క బిల్లు కూడా అమోదానికి నోచుకోలేదు.

 

ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ లను తన ఇంటికి టీ సమావేశానికి ఆహ్వానించి మాట్లాడినప్పుడు వారు సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చేయి. కానీ యధాప్రకారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని స్తంభింపజేస్తూనే ఉంది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చొరవ తీసుకొని నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఒక్క జి.ఎస్.టి. బిల్లుకి తప్ప మిగిలిన అన్నిటినీ ఆమోదించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చేయి.

 

సోనియాగాంధీ స్వయంగా జి.ఎస్.టి. బిల్లు ఆమోదానికి సహకరిస్తామని ఇదివరకు ప్రధాని నరేంద్ర మోడికి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు దానికి తప్ప మిగిలిన అన్ని బిల్లుల ఆమోదానికి సహకరిస్తామని చెప్పడం విశేషం. ఆ బిల్లునే మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు సూచించింది. అవి చేస్తే తప్ప దాని ఆమోదానికి సహకరించమని కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పింది. కనుక ఈ సమావేశాలలో జి.ఎస్.టి. బిల్లు ఆమోదం పొందే అవకాశాలులేనట్లే కనిపిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో మిగిలిన అన్ని బిల్లుల ఆమోదానికి సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కనుక ఈరోజు పార్లమెంటు ఉభయసభల సమావేశాలు సజావుగా సాగే అవకాశం ఉంటుందేమో?

 

ఆ బిల్లులలో 16-18సం.ల వయసున్నవారు హత్యలు, అత్యాచారాలకు పాల్పడినట్లయితే వారినీ పెద్దవారిగా పరిగణించి శిక్ష వేయాలని బాలనేరస్థుల చట్టంలో మోడీ ప్రభుత్వం ఒక సవరణ చేసింది. ఆ బిల్లు కూడా నేడు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఒకవేళ అది ఆమోదం పొందినట్లయితే నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మూడేళ్ళు శిక్ష అనుభవించి రేపు విడుదల కాబోతున్న బాల నేరస్థుడి విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉండవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu