షర్మిల యాత్రలో సోనియా అల్లుడిని ఏకిపారేస్తారా?
posted on Oct 11, 2012 7:05PM


చంద్రబాబు పాదయాత్రకు పోటీగా వై.ఎస్ తనయ షర్మిల పాదయాత్రకి రంగం సిద్ధమౌతోంది. వాస్తవానికి ఈ యాత్రను జగన్ చేయాల్సి ఉందని, తనికిప్పుడు వీలుపడదు కనుక షర్మిల ఆధ్వర్యంలో యాత్రని సాగించాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి వెల్లడించారు. ఉపఎన్నికల సమయంలో మీ రాజన్న కూతుర్ని వచ్చాను, అన్నకు అన్యాయం జరుగుతోంది అంటూ షర్మిల చేసిన ప్రసంగాలకు జనం బాగా ఆకర్షితులయ్యారు. విపరీతమైన స్పందన వెల్లువెత్తింది. అది ఓట్ల రూపంలో వెల్లువై కురిసింది. ఇప్పుడు చంద్రబాబుకి పాదయాత్రలో వస్తున్న స్పందనని చూసి వైకాపా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందుకే షర్మిల ఇడుపులపాయనుంచి పాదయాత్రని మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ యాత్రలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వధేరా అవినీతిని ఏకిపారేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రణాళిక ప్రకారం జగన్ ని టార్గెట్ చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారం నిజంగా నిజమైతే అలాంటి ఆరోపణలే ఎదుర్కుంటున్న సోనియా అల్లుడిని ఏం చేయాలంటూ షర్మిల బహిరంగంగా పార్టీ పెద్దల్ని నిలదీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా.