ఆయన్ని పక్కనబెట్టి వాళ్ళకి పదవులా?

 

తన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందుకు రేవంత్ రెడ్డిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా టార్గెట్ చేశారో అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా తన పంధాలోనే సాగుతూ కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. వరంగల్ జిల్లాలో రైతు భరోసా యాత్రలో మాట్లాడుతూ తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళనందరినీ పక్కనబెట్టి ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వాళ్లకి, ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకి కేసీఆర్ తన ప్రభుత్వంలో కీలక పదవులు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. తెదేపాను తెలంగాణా ద్రోహుల పార్టీ అని విమర్శిస్తున్నప్పుడు మరి వాళ్ళనే మళ్ళీ పిలిచి పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం నిండా తెలంగాణా ద్రోహులే ఉన్నారని వాళ్ళు వరంగల్ ఉప ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణా పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడిన కొండా సురేఖ వంటి వాళ్ళను చేరదీసిన కేసీఆర్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రొఫెస్సర్ కోదండరామ్ ను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారని విమర్శించారు.

 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోపంతో విమర్శిస్తున్నప్పటికీ ఆయన చేస్తున్న విమర్శలు చాలా ఆలోచన రేకెత్తిస్తున్నాయి. తెరాస నేతలు తరచూ తెదేపాను తెలంగాణా ద్రోహుల పార్టీ అని ఎద్దేవా చేస్తుంటారు. తెదేపాలో ఉన్నప్పుడు తెలంగాణా ద్రోహి అయిన వ్యక్తి తెరాసలోకి మారగానే తెలంగాణా శ్రేయోభిలాషి అయిపోడు. తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా తెదేపాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు నేర్చుకొని బయటకు వచ్చి తెరాస స్థాపించారు. బహుశః ఆ కారణంగానే ఆయన తెదేపా నేతలకు, ప్రజా ప్రతినిధులకు పదవుల ఎర వేసి తెరాసలోకి రప్పించుకొంటున్నట్లున్నారు. ఒక విధంగా ప్రస్తుతం తెరాస ప్రభుత్వంలో తెదేపా నేతలకే ప్రాధాన్యం ఉంది కానీ తెరాస, కాంగ్రెస్ నేతలకు కాదు. పైగా నేటికీ తెదేపా నుండి తెరాసలోకి వెళ్ళిన తలసాని వంటి ఎమ్మెల్యేలు అందరూ తెదేపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. కనుక తెరాస నేతలు తెదేపాను దూషిస్తే తమను తాము దూషించుకొన్నట్లే అవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu