ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు
posted on Jan 19, 2026 9:23AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి సారిగా రిపబ్లిక్ వేడుకలకు వేదిక కాబోతోంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ విజయవాడ, విశాఖపట్నంలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు తొలి సారిగా ఈ ఏడాది అమరావతిలో జరగనున్నాయి. ఈ నెల 26న నిర్వహించనున్న 77వ రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత వైభవంగా, రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పేలా నిర్వహించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాజధానిలోని మంత్రుల నివాస సముదాయం వద్ద ఉన్న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయి. అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతుండటం, ఇప్పుడు అమరావతిలోనే గణతంత్ర వేడుకల నిర్వహణ రాజధానిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి వేడుకగా తొలిసారిగా జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరు కానున్నారు. దాదాపు పది వేల మందికి పైగా ఈ వేడుకలను వీక్షించేలా వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసు బలగాల కవాతు , విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. అమరావతిలో రిపబ్లిక్ డే నిర్వహణ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు, రైతులూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి ముస్తాబవుతుండటంతో రాజధాని ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర గవర్నర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.