మత్స్య కారుల బీమా పరిహారం రూ. 10 లక్షలకు పెంపు
posted on Jan 19, 2026 9:48AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటి వరకూ వారికి ఉన్న రెండు లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి బీమా మొత్తాన్ని ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన , రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమన్వయంతో ఈ పెంపును అమలు చేస్తారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నది. వారి ఈ బీమా సదుపాయం మరణం సంభవించిన తీరును బట్టి రెండు రకాలుగా ఉంటుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే, సదరు మత్స్యకార కుటుంబానికి కొత్త నిబంధనల ప్రకారం రూ. 10 లక్షల భారీ పరిహారం నేరుగా అందుతుంది. అయితే, వేటతో సంబంధం లేకుండా సాధారణ అనారోగ్యం, ఇతరత్రా ప్రమాదాల్లో మరణించినట్లయితే.. కార్మిక శాఖ ద్వారా అమలులో ఉన్న పాత నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బీమా సహాయం వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వేట సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా అండ లభించనుంది.
ప్రస్తుత ప్రభుత్వం కేవలం బీమా పరిహారం ఇప్పుడు పెంచింది. ఇంతకు ముందే.. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచింది. అలాగే సబ్సిడీపై వలలు , బోట్ల ఇంజిన్లను అందజేయడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా చర్యలు తీసుకుంటోంది.