మహాపూజతో నాగోబా జాతర షురూ
posted on Jan 19, 2026 10:00AM
.webp)
తెలంగాణ రాష్ట్ర పండుగనాగోబా జాతర’ ఆదివారం (జనవరి 18) రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆసియాలోనే రెండో అతి పెద్ద గిరిజన పండుగ అయిన నాగోబా జాతర మెస్రం వంశీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో మహాపూజ నిర్వహించడంతో ఆరంభమైంది. ఆదివారం ఉదయం నుంచే మెస్రం వంశీయులు తమ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక పూజలు చేపట్టారు. కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజా సామగ్రితో ఊరేగింపుగా బయలుదేరారు. ఆదివాసీ వాయిద్యాలైన డోలు, తుడుం మోగుతుండగా.. పాదయాత్ర ద్వారా తెచ్చిన పవిత్ర జలంతో వారు ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ఆలయ ముఖద్వారం వద్ద కొలువై ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించిన అనంతరం నాగోబాను దర్శించుకుని సంప్రదాయ రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు.
జాతరలో అత్యంత కీలక ఘట్టమైన మహాపూజ ఆదివారం (జనవరి 18) రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. అనంతరం మెస్రం వంశీయులు ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. మహాపూజను పూర్తి చేశారు. ఈ మహాపూజ సమయంలో మెస్రం వంశీయులకు తప్ప, ఇతరులకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఉండదు. మహాపూజ ముగియడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు నాగోబా దర్శనానికి తరలివస్తున్నారు.