ఇక పార్టీ కార్యకర్తల నుంచి ప్రతి రోజు ఫీడ్ బ్యాక్ : లోకేష్
posted on Jun 25, 2025 4:31PM

రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని లోకేష్ తెలిపారు. కూటమి సర్కార్ ఏడాది పాలను జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని.. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు.
ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను ప్రతీ రోజు ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని..తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు విషయంలో టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని వైసీపీ నేతలు చూశారని ఆయన అన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు అభివృధి చేసిన జైలులోనే ఆయనను పెట్టినప్పుడు నాకు చాలా బాధ వేసిందని లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతల దురాగతాల వల్ల టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారని ఆయన అన్నారు.
టీడీపీ సిద్ధాంతాలు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అహంకారంతో కాకుండా బాధ్యతతో చేయాలని ఆయన కోరారు. అలా అహంకారంతో ఉంటేనే 151 నుంచి 11కి వచ్చారని వైసీపీ వ్యాఖ్యనించారు. మచిలీపట్నం అంటే తెలగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు గారికోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలని లోకేశ్ తెలిపారు.
ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నామని లోకేశ్ పేర్కొన్నారు. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించాలనేది ముందు మన ఇంట్లో మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సీడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు