కేసీఆర్ వల్లే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు : కవిత
posted on Jun 25, 2025 5:19PM

గోదావరి జలాల అంశంపై నిన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం అయితే ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు.
ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు