నవంబర్ 15 నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి ప్రారంభం

అతిత్వరలో రామగుండం ఎరువులు అందుబాటులోకి

 

నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభం

 

కిసాన్ పేరుతో విడుదల

 

99.5 శాతం పనులు పూర్తి

 

వెయ్యిమందికి ఉపాధి

 

తెలంగాణ రైతుల ఎరువుల వేతలు ఇక మాయం

 

తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎరువుల వెతలు అతి త్వరలో తీరనున్నాయి. ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ అతి త్వరలో ప్రారంభం కానుంది.

 

ఇప్పటికే 99.5శాతం పనులు పూర్తి కాగా పాయింట్ ఐదుశాతం పనులు పూర్తి కావడానికి రెండునెలల సమయం పట్టనుంది. నవంబర్ 15 నుంచి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు కిసాన్ బ్రాండ్ పేరుతో మార్కెటులోకి రానున్నాయి.రూ.6,120.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కర్మాగారంలో ప్రతిరోజూ 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుంది.

 

గతంలో మూతపడిన ఎరువుల కర్మాగారం స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్ఎల్‌), ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐల్‌)తో జాయింట్‌ వెంచర్‌గా ఈ ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు.  ఈ ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారా, నీటి వనరులను గోదావరి నది పై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుండి అందిస్తారు.

 

రాష్ట్ర అవసరాలకే  మొదటి ప్రాధాన్యత
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన యూరియా సగం తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు వినియోగిస్తారు. ప్రాజెక్ట్ ల్లో నీరు  సమృద్ధిగా ఉండటం, చెరువులు జలకళతో కళకళలాడటంతో తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 10లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర అవసరాల మేరకు కావల్సిన  యూరియాను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో ఎరువుల కొరత ప్రతిఏడు రైతులను ఇబ్బంది పెడుతోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీరనుంది.

 

నాలుగు దశాబ్దాల కిందట ..
రామగుండం 1980లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం మొదటి నుంచి  అనేక సమస్యలను ఎదుర్కోంటూ 18 సంవత్సరాలు ఎరువులను అందించింది. మూడువెల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభమైనప్పటికీ బొగ్గు కొరత కారణంగా రోజుకు 1500 టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది.  నష్టాలభారం, కార్మిక సమస్యల కారణంగా ఎక్కువ రోజులు ఈ పరిశ్రమ మనుగడ సాగలేదు. ఆ తర్వాత క్రమేణా 750 టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలగడంతో  నష్టాల భారం పెరిగింది. ఆసియాలోనే ప్రయోగాత్మకంగా బొగ్గు ఆధారంగా ఎరువులు తయారు చేసే ఈ కర్మాగారాన్ని  1992లో బీఐఎఫ్ఆర్‌ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించి,  1999 లో మూసివేశారు.

 

మూతపడ్డ 20ఏండ్ల తర్వాత
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దానికి సాంకేతికతను అందించి గ్యాస్‌ ఆధారిత ఫ్యాక్టరీగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని ప్రారంభించారు. బొగ్గు గనులతోపాటు వెలుగులు నింపే ఎన్టీపీసీవంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో రామగుండానికి మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు వచ్చింది. మూతపడ్డ 20 ఏళ్ళ తర్వాత ‘రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థానంలో కొత్తగా ‘రామగుండం ఫర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌’ పేరుతో 2016లో కొత్త యూనిట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. గ్యాస్‌ సరఫరా చేసేందుకుగాను ఏపీలోని కుంచనపల్లి నుంచి 360 కిలోమీటర్ల మేర గ్యాస్‌ పైపులైన్లు వేశారు. గ్యాస్‌ సరఫరాలో ఏదైనా అంతరాయం గానీ, ప్రమాదాలు గానీ జరిగినప్పుడు నియంత్రించేందుకు 15 చోట్ల ఎస్‌వీ స్టేషన్ల (గ్యాస్‌ నియంత్రణ ప్రదేశాలు) నిర్మించారు.

 

వచ్చే నెలలో ఫ్యాక్టరీని సందర్శించనున్న కేంద్రమంత్రి
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటులో జరుగుతున్న పనులపై అధికారులతో  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువాతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 99.5శాతం పనులు పూర్తి అయ్యాయని మరో రెండునెలల్లో మిగతా పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు. సెప్టెంబర్ నెలలో ఫ్యాక్టరీని సందర్శిస్తానని మంత్రి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో సగం తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తామని, మిగతా సగం ఇతర రాష్ట్రాల రైతులకు అందిస్తామని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu