విశాఖలో గెస్ట్ హౌస్ పై ఒక పక్క హైకోర్టులో విచారణ.. మరో పక్క భూమి కేటాయింపు జీవో జారీ
posted on Aug 27, 2020 7:20PM
విశాఖలో నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఏపీ సర్కారు 30 ఎకరాలు జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ జీవో జారీ చేసింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాపులుప్పాడ గ్రేహౌండ్ భూముల్లో ఈ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దును సవాల్ చేస్తూ అమరావతి రైతులతో పాటు పలు సంఘాలు హైకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో హైకోర్టు ఈ అంశం పై స్టేటస్ కో విధించింది.
మరో వైపు స్టేటస్ కో ఉన్న సమయంలో కూడ విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఒక న్యాయవాది ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలలోనే విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కాపులుప్పాడ కొండపై 30 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ ఏపీ ప్రభుత్వం 1353 జీవో జారీ చేస్తూ.. దీన్ని అత్యవసరంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది.