రైల్వే బడ్జెటులో ఆంద్ర, తెలంగాణాలకు న్యాయం జరిగేనా?



ఈరోజు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ లోక్ సభలో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కంటే ముందే ఎన్డీయే ప్రభుత్వం రైల్వే చార్జీలను భారీగా పెంచినందువలన, ఈరోజు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో ప్రజలపై మళ్ళీ ఎటువంటి అదనపు భారం వేయబోదని అందరూ విశ్వసిస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో రైల్వేల ఆదునీకరణ, రైళ్ళలో కొత్త సౌకర్యాలు కల్పన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

ఆంద్ర ప్రదేశ్, తెలంగాణాలకు సంబంధించినంత వరకు చూసుకొన్నట్లయితే, ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్టేర్ (విశాఖపట్నం) డివిజన్ను దానిని నుండి విడదీసి, విశాఖ కేంద్రంగా ఆంధ్రాకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్న వైజాగ్ నుండి విజయవాడకు, విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి(వీజీటీయం) పట్టణాలను కలుపుతూ మెట్రో రైల్ ప్రాజెక్టుల మంజూరు, విజయవాడ-హైదరాబాదులను కలుపుతూ హై స్పీడ్ రైళ్ళు మంజూరు, గత బడ్జెట్ లో ఆమోదించిన కొన్ని రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, కొన్ని కొత్త రైళ్ళను ప్రకటించడం, వీక్లీ రైళ్ళను డైలీగా మార్చడం వంటివాటికి ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు.

 

ఇక ఈసారి బడ్జెట్ పై తెలంగాణా పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందే చెప్పడం చూస్తే, తెలంగాణకు పెద్దగా కేటాయింపులు ఉండబోవని స్పష్టమవుతోంది. అయితే ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కావచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే జరిగితే, తెలంగాణాకు పెద్ద వరంగానే భావించవచ్చును. కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్లయితే వేలమందికి ఉపాధి దొరుకుతుంది, ఆ ప్రాంతం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రైల్వేమంత్రి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కానీ ఆంధ్ర, తెలంగాణాలకు ఆయన ఏమేమి వరాలు ప్రకటించబోతున్నారో అనే విషయం బయటపడదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu