హవ్వ... లండన్లో కంపెనీనా?
posted on Nov 19, 2015 10:05AM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ ముద్దుల తనయుడు రాహుల్ గాంధీ చేసిన తాజా నిర్వాకం ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నిర్వాకం ఏమిటంటే, అదేనండీ... లండన్‌లో కంపెనీని పెట్టడం కోసం రాహుల్ గాంధీ తనను బ్రిటీష్ జాతీయుడిగా పేర్కొనడం. సుబ్రహ్మణ్య స్వామి వెల్లడి చేసిన ఈ వివరాలు రాహుల్ గాంధీ గొంతులో మాత్రమే కాదు... కాంగ్రెస్ పార్టీ గొంతులో కూడా వెలక్కాయలా మారాయి. ఇప్పుడా వెలక్కాయని మింగలేక కక్కలేక అల్లాడుతున్నారు. రాహుల్ గాంధీని ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలూ పడుతోంది. రాహుల్ గాంధీ కూడా తాను లండన్‌లో కంపెనీ పెట్టే సమయంలో తనను తాను ఇండియన్‌గానే పేర్కొన్నాను తప్ప బ్రిటీష్ జాతీయుడని కాదని వివరణ ఇచ్చుకున్నాడు. రాహుల్ గాంధీ తనను ఇండియన్ అని పేర్కొన్నాడా... బ్రిటీష్ జాతీయుడని పేర్కొన్నాడా అనే విషయాలను అలా వుంచితే... ఇప్పుడు రాజకీయ విమర్శకులు మరో తరహా విమర్శ కూడా చేస్తు్న్నారు. ఇండియాకి ప్రధానమంత్రి కావాలని కలలు కన్న వ్యక్తి తాను పెట్టే కంపెనీ మన దేశంలోనే పెట్టకుండా బ్రిటన్లో పెట్టడం ఏమిటి?
మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి అని భారతదేశం ఎప్పటి నుంచో విదేశాలలోని సంపన్న వర్గాలను, పారిశ్రామికవర్గాలను కోరుతోంది. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం మాత్రమే కాదు.. కేంద్రంలో పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరించింది. మరి ఆ కాంగ్రెస్ నాయకుడే బ్రిటన్లో కంపెనీ పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ తాను పెట్టబోయే కంపెనీ లండన్లో కాకుండా ఇండియాలోనే పెడితే ఎంతమందికి ఉపాధి దక్కేది? దేశంలో ప్రభుత్వం నడిపే పార్టీ ప్రముఖుడే ఈ దేశంలో కంపెనీ పెట్టకుండా లండన్లో కంపెనీ పెట్టినప్పుడు, ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన దేశంలో ఎందుకు కంపెనీలు పెడతారు? ఇది రాహుల్ గాంధీ దేశం పరువును తీసినట్టు కాదా.... అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు రాహుల్ గాంధీ ఏమని సమాధానం చెబుతారో!