చండీయాగం: ఈయన పిలవరు... ఆయన వెళ్ళరు...
posted on Nov 19, 2015 9:02AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయం నుంచీ ఒక నమ్మకం వుంది. తాను ఏవైనా సమస్యల్లో చిక్కుకుని వుంటే ఆయన వెంటనే చండీయాగానికి ఏర్పాట్లు చేసేస్తారు. అదేంటోగానీ ఆయన చండీయాగం చేసిన తర్వాత సమస్యలన్నీ ఆటోమేటిగ్గా తొలగిపోయి మరింత ఉత్సాహంతో ఉద్యమం చేసేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రస్తుతం ఆయన్ని అనేక సమస్యలు చుట్టిముట్టి వున్నాయి. ఆ సమస్యలను అధిగమించాలంటే చండీయాగం చేయడమే మార్గమని భావించారని, అందుకే తన ఫామ్ హౌస్‌లో చండీయాగం జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ తాను నిర్వహించబోతున్న చండీయాగానికి దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్రమోడీని కూడా చండీయాగానికి రావల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కేసీఆర్ చంద్రబాబును చండీయాగానికి పిలుస్తారా... ఈయన పిలిస్తే ఆయన వస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కేసీఆర్ని పిలిస్తే ఈయన హాజరయ్యారు కదా... మరి ఈయన పిలిస్తే ఆయన హాజరయ్యే అవకాశం వుంది కదా అని కొన్ని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.
అయితే అమరావతి శంకుస్థాపనను, కేసీఆర్ చేయబోయే చండీయాగాన్ని ఒకేలా చూడటం కరెక్టు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను నిర్వహించే చండీయాగానికి కేసీఆర్ చంద్రబాబును పిలిచే అవకాశం లేదని... ఒకవేళ ఈయన పిలిచినా చంద్రబాబు వచ్చే అవకాశం లేదనీ పరిశీలకులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈయన పిలవరు.. ఆయన రారు అని స్పష్టంగా అంటున్నారు. ఎందుకంటే, అమరావతి శంకుస్థాపన ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత మరో రాష్ట్ర ప్రభుత్వాధినేతకు అందించిన ఆహ్వానం అది. అయితే చండీయాగం అనేది పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈయన ఆయన్ని పిలవటం గానీ, ఆయన రావడం కానీ జరిగే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.