రఘురామ నిరాహార‌ దీక్ష.. జ‌గ‌న్ దిగొస్తారా?

జోరు మీదున్న ర‌ఘురామ దూకుడు పెంచారు. మాట‌ల‌తో ప‌ని కావ‌ట్లేద‌ని.. దీక్ష‌కు దిగారు. ఆయ‌న ఏం చేసినా.. ప్ర‌జ‌ల కోస‌మేగా. ఈసారి ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారు. రివ‌ర్స్ పీఆర్సీపై మండిప‌డుతూ.. జ‌గ‌న్ స‌ర్కారు దిగొచ్చేలా నిరాహార దీక్ష చేప‌ట్టారు. 

ఏపీ ఉద్యోగులకు సంఘీభావంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ర‌ఘురామ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. జ‌గ‌న్‌ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా రఘురామ ఈ ఉపవాస దీక్ష చేపట్టారు.

అధికారుల కమిటీ అనేక సిఫార్సులు చేసినప్పటికీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ వ్యతిరేకించారు. మిశ్రా కమిషన్ నివేదికను బహిర్గతం చేయకుండా సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదిక ఆధారంగా చేసిన పీఆర్సీ సంబంధిత అంశాల ప్రకటనను రఘురామ తీవ్రంగా వ్యతిరేకించారు. 30 శాతం ఫిట్‌మెంట్‌తో 1-7-2019 ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. త‌మ త‌ర‌ఫున దీక్ష చేస్తున్న‌ ర‌ఘురామకు ఉద్యోగులు కృత‌జ్ఞ‌త చెబుతున్నారు. హెచ్ఆర్ఏపై స‌ర్కారు పున‌రాలోచ‌న చేయ‌క‌పోతే తాము సైతం దీక్ష‌ల‌కు దిగుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.