నెక్స్ట్ సీఎం నేనే.. తేల్చి చెప్పిన రేవంత్...

మీకసలు అర్థమవుతోందా ..ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ సినిమాలో హీరొయిన్ రష్మిక అదో విధంగా పలికి పాపులర్ చేసిన  ఊత పదం. అయితే, ఈ సినిమా పాప పాపులర్ చేసిన  ఊతపదానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటంటే ... పెద్దగాలేదు గానీ కొంచెంగా అయితే వుంది. సరే, అదలాఉంచి విషయంలోకి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి కేసీఆర్ ఉన్న సెక్రటేరియట్ కూల్చి, అక్కడే కొత్త సెక్రటేరియట్ కడుతున్నారు... ఇది ఎవరి కోసం కడుతున్నారో ... మీకేమైనా అర్థమవుతోందా అంటే, అందులో అర్థం కాకపోవడానికి ఏముంది, అయితే ఆయన కోసం కాదంటే, వారసుడు కేటీఆర్ కోసం అని సమాధానం రావచ్చును. కానీ, అదే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడిగారునుకోండి ... ఇంకెవరి కోసం ... ‘నా కోసమే’ అంటారు . అవును, అంటారు కాదు, అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కోసమే కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని చిట్ చాట్’లో రేవంత్ రెడ్డి ఒకటికి నాలుగు సార్లు  తేల్చి చెప్పారు.  

ఈ మధ్య కాలంలో కొవిడ్’కు భయపడి రాజాకీయ నాయకులు ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్’లు పెట్టడం లేదు. అప్పుడుప్పుడు అందుబాటులో ఉన్న విలేకరులతో చిట్ చాట్’లతో సరిపెట్టేస్తున్నారు. అలాగే, పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కూడా లేటెస్ట్‌గా చిట్ చాట్ నిర్వహించి మనసులోని  మాటలను  మీడియాతో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని, మొదలు పెట్టి, ఆయన గురించి, పరిపాలన గురించి చాలా విషయాలు చెప్పు కొచ్చారు. క్షేత్ర స్థాయిలో కేసీఆర్’కు అంత సీన్ లేదని, వాస్తవ  పరిస్థితులు ఆయన ఆలోచనలకు చాలా విరుద్దంగా ఉన్నాయని అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ గురించి కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ఇదే విషయం తాను రాష్ట్రమంతా కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేసేందుకు ముహర్తం ఖరారయ్యిందినే చర్చ జరుగుతున్నప్పుడే చెప్పానని గుర్తుచేశారు.ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని, కలలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. 
ఇదే సమయంలో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ఎవరికోసం కట్టిస్తున్నారు? పాత సెక్రటేరియట్ వాస్తు బాగోకనే ఇంతవరకు ముఖ్యమంత్రులు కుమారులు ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు,అనేకదా కేసీఆర్ ఉన్న సెక్రటేరియట్ కూల్చి, వాస్తు చూసుకుని మరీ  కొత్త సెక్రటేరియట్  కట్టిస్తోంది? అంటే ... కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టిస్తోంది కొడుకు  కోసం కాదు .. నా కోసమే .. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా  వ్యక్తం చేశారు. దేశమంతా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని,  తెలంగాణలో కూడా అవే పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో  నూతన సెక్రటేరియట్ కేసీఆర్ తన కోసం నిర్మిస్టున్నాడని రేవంత్  ఒకటి నాలుగు సార్లు నొక్కి.. నొక్కి  వక్కాణించారు .సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంటే రేవంత్ రెడ్డి తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించుకున్నారు..అనుకోవచ్చును. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల ఎంపిక ఎలా జరుగుతుందో, ఆ ఒక్క విషయంగా ఎంత రచ్చ రభస క్జరుగుతుందో వేరే చెప్పా నక్కర లేదు. ప్రస్తుతం పంజాబ్’లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే సరిపోతుంది. అంతే కాదు,  కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపెందుకు ఇది చాలు అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని భగ్గు మంటున్న, ‘సీనియర్లు’ ఇప్పుడు ఎలా స్పందిస్తారో .. చూడవలసి ఉందని అంటున్నారు.చూద్దాం .