'చింతామణి' నాటకంపై నిషేధం.. వైశ్యులకు జగనన్న గాలం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ప్రదర్శితమవుతున్న  ‘చింతామణి’ నాటక ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్య వైశ్యులను కించపరిచేలా చింతామణి నాటక ప్రదర్శన ఉంటోందంటూ ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు నిషేధం విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.  అప్పటి సమాజ పరిస్థితుల నేపథ్యంలో కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. దశాబ్దాల తరబడి చింతామణి నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.

చింతామణి నాటకం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించడం పోయి వ్యసనాల వైపు సమాజాన్ని నడిపించేలా ఉందని, అందుకే దీన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. చింతామణి నాటకం తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి సంఘం నేతలు తీసుకెళ్లారు. ఆర్యవైశ్య సామాజికవర్గం నేతల డిమాండ్ మేరకు చింతామని నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకం ప్రదర్శించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. నిషేధ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడైనా.. ఎవరైనా చింతామణి నాటకం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఏపీ సర్కార్ హెచ్చరించింది.

చింతామణ నాటకంపై నిషేధం విధించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటక ప్రియులు మాత్రం ఈ నిర్ణయం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రోశయ్య మరణిస్తే వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించపోవడం.. వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై సొంతపార్టీ నేతలే దాడి చేసి కొట్టడం.. తదితర ఘటనలతో వైశ్యులంతా జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా మారారు. ఆ వ్యతిరేకతను కాస్త తగ్గించేందుకే ఇప్పుడిలా చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిందని అంటున్నారు.