పంజాబ్ కేబినెట్ విస్తరణ.. కొత్తగా ఐదుగురికి చాన్స్

పంజాబ్ లో తొలి సారిగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ఐదుగురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.

రెండు రోజుల కిందట హస్తిన వెళ్లిన మాన్ అక్కడ ఆఫ్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అప్పట్లోనే మాన్ కేబినెట్ విస్తరణపై ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని మాన్ అప్పుడు ఖండించారు. పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా పంజాబ్ లోనే తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించారు.

ఇంత హఠాత్తుగా అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు పూనుకోవడానికి ఇటీవల పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. అధికారం చేపట్టిన మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో జరిగిన ఒక ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడంతో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుపుకోవలసిన అవసరాన్ని గుర్తించిన మాన్.. కేబినెట్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించారు.

అందుకే కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. కొత్తగా ఐదుగురిని కేబినెట్ లోకి తీసుకోనుండడంతో పంజాబ్ లో సీఎం సహా  మంత్రుల సంఖ్య 15కు పెరుగుతుంది. సోమవారం సాయంత్రం పంజాబ్ రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.