దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ వార్షిక సమావేశం

 

ఆగస్టు 29 నుండి పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ 24వ వార్షిక సమావేశం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, యువ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ రంగంలో తాజా ఆవిష్కరణలు, కొత్త చికిత్సా పద్ధతులు, అధునాతన శస్త్రచికిత్సా సాంకేతికతలపై చర్చించారు. 5 వేల మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తిరుపతి బర్డ్ హాస్పిటల్ సంచాలకులు డా. గుడారు జగదీష్ ఈ సమావేశంలో పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు.

“యువ రోగులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా వివరించారు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న రోగులకు దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే మోకాలి సమస్యల సందర్భాల్లో మోకాలి మార్పిడి అవసరం అవుతుందని వివరించారు. చిన్న వయసులో ఇలాంటి శస్త్రచికిత్సలలో ఎదురయ్యే సవాళ్లు, ఆపరేషన్ అనంతర జీవిత నాణ్యతలో వచ్చే మార్పులను విశ్లేషించారు. అదేవిధంగా చిన్న వయసులో జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? ఆపరేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై లోతైన అవగాహన కల్పించారు.

“ఉద్యోగం చేయలేక, ఇంటికే పరిమితం అయిన రోగుల జీవితాన్ని మార్చడంలో మోకాలి మార్పిడి ఆపరేషన్ కీలకం” అని డా. జగదీష్ అన్నారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సర్జన్ నైపుణ్యం, ఆపరేషన్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, నాణ్యమైన ఇంప్లాంట్ల ఎంపిక ప్రధానమని ఆయన పేర్కొన్నారు. తన అనుభవాలు, పరిశోధనల ఆధారంగా యువ రోగులకు ఈ శస్త్రచికిత్సలో పరిగణించాల్సిన అంశాలను వివరించారు.

1999లో బర్డ్ హాస్పిటల్‌లో 21 ఏళ్ల యువతికి చేసిన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. 26 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహిళ ఆరోగ్యవంతంగా, చురుకుగా జీవిస్తున్నారని వివరించారు. ఈ తరహా ఉదాహరణల ద్వారా సరైన ఆర్థోపెడిక్ చికిత్సలతో యువ రోగులు కూడా పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆయన స్పష్టం చేశారు. డా. జగదీష్ ప్రసంగం యువ వైద్యులు, పరిశోధకులకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఈ సమావేశం ఆర్థోపెడిక్ వైద్య రంగంలో కొత్త పరిశోధనలకు, మెరుగైన చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu