ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది : ఆర్మీ చీఫ్ ద్వివేది

 

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో తొలిసారి ద్వివేది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు. పాక్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని,  వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయని ద్వివేదీ పేర్కొన్నారు.  ఎలాంటి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంమని స్పష్టం చేశారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu