తెలుగు రాష్ట్రాలలో ఘనంగా భోగి వేడుకలు
posted on Jan 14, 2026 6:21AM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బుధవారం (జనవరి 14) తెల్లవారు జామునే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, భోగి పాటలు పాడుతూ సందడి చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొంటుండటంతో తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో జరిగిన భోగి సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని సందడి చేశారు.
