జగన్ కు నర్సీపట్నంలో నిరసనల సెగ
posted on Oct 9, 2025 3:21PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటన రసాబాసగా మారింది. ఆయన పర్యటన సందర్భంగా నర్సీపట్నం వ్యాప్తంగా దివంగత డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు ఆయనకు స్వాగతం పలికాయి. కరోసా సమయంలో డాక్టర్లకు కనీసం మాస్కు కూడా ఇవ్వలేకపోయిందంటూ అప్పటి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన కారణంగా దళితుడైన డాక్టర్ సుధాకర్ పై అప్పటి జగన్ సర్కార్ అత్యంత అమానుషంగా వ్యవహరించింది.
ఆయన విమర్శలను సాకుగా చూపుతూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిది. అంతటితో ఆగకుండా సుధాకర్ ను విశాఖలోని పోర్టు ఆస్పత్రి జంక్షన్ వద్ద మండుటెండలో అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోపెట్టి చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి మరీ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేశారు. దీనిపై అప్పట్లో ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. వైసీపీ వేధింపుల కారణంగానే సుధాకర్ మరణించినట్లు ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశాయి.
.webp)
ఇప్పుడు ఇన్నేళ్లకు జగన్ మెడికల్ కాలేజీ సందర్శన అంటూ నర్సీపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా దళిత సంఘాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ గోబ్యాక్ అని నినదిస్తూ నర్నీపట్నంలో మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాయి. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను అన్యాయంగా చంపేశారంటూ విమర్శలు గుప్పించాయి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశాయి.
ఓ వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, మరో వైపు దళిత సంఘాల నిరసనలతో వైసీపీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి. మరో వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన దృశ్యాలను మరో సారి నెట్టింట పోస్టు చేస్తూ నెటిజనులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.