ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు... 9 దుంగలు స్వాధీనం
posted on Oct 9, 2025 3:20PM

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఒక స్మగ్లరును అరెస్టు చేసింది. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ వినోద్ కుమార్ టీమ్ బుధవారం అన్నమయ్య జిల్లా పుల్లంపేట నుంచి కూంబింగ్ చేపట్టింది.
అక్కడ ఏం.బావి పారెస్టు బీటు పరిధిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఒక వ్యక్తి కనిపించాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా, వెంబడించి పట్టుకున్నారు. అతనిని విచారించగా పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిలో ఉపయోగించినవి 6 ఉండగా, మూడు కొత్తవి ఉన్నాయి. అతనిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇతనిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. అతనిని డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ లు విచారించారు. సీ ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.