మాస్క్ పెట్టుకోండి సారూ.. ఈ పెద్దోళ్లు ఉన్నారే...

సీఎస్ సోమేశ్‌కుమార్‌. మోస్ట్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అనే పేరు. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప‌నులు ప‌లుసార్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. సీఎం కేసీఆర్‌ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తార‌ని.. ముఖ్య‌మంత్రిని ప‌లు అంశాల్లో మిస్ గైడ్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని ఐఏఎస్ స‌ర్కిల్స్‌లో టాక్‌. పాల‌సీ మేట‌ర్స్ గురించి ప‌క్క‌న పెడితే.. మాస్క్ పెట్టుకోవ‌డం లాంటి చిన్నిచిన్న విష‌యాల్లోనూ సీఎస్ తీరు అసంబ‌ద్దంగా ఉంటుంద‌నే విమ‌ర్శ ఉంది. 

ఓవైపు తెలంగాణ‌లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజూ వేల‌ల్లో కేసులు వ‌స్తున్నాయి. సాక్షాత్తూ హెల్త్ డైరెక్ట‌ర్‌కే పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా ఇంత సివియ‌ర్‌గా ఉన్న సంద‌ర్భంలో.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిల‌వాల్సిన సీఎస్‌, మంత్రి, ఎంపీ.. ఇదిగో ఇలా మాస్క్ లేకుండా మీటింగ్‌కు హాజ‌ర‌వ‌డం కాంట్ర‌వ‌ర్సీగా మారింది. 

సీఎస్‌తో పాటు ఆయ‌న‌ ప‌క్క‌న ఉన్న మంత్రి పువ్వాడ అజ‌య్ సైతం మాస్క్ పెట్టుకోలేదు. ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా మాస్క్ పక్కన పెట్టేశారు. మ‌రోమంత్రి ఎర్ర‌బెల్లి మాత్రం బుద్ధిమంతుడిలా మాస్క్ పెట్టుకున్నాడు. ఎందుకంటే, ఆయ‌నకు ఇటీవ‌లే కొవిడ్ బారినప‌డి కోలుకున్నారు. క‌రోనా సోకితే ఆ పెయిన్ ఎలా ఉంటోందో ఎర్ర‌బెల్లికి బాగా తెలిసిన‌ట్టుంది. అందుకే, సిన్సియ‌ర్‌గా మాస్క్ పెట్టుకున్నారు. సారూ.. మీ ప‌క్క‌నున్న మంత్రికి, సీఎస్‌కు కూడా కుసుంత చెప్ప‌రాదే.. మాస్క్ పెట్టుకోమ‌ని....

ఇక ఈ ఫోటో చూడండి.. ఆ స‌మీక్ష‌కు హాజ‌రైన మిగ‌తా వారంతా మాస్కుల‌తోనే ఉన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్‌, మినిస్ట‌ర్ అజ‌య్‌లు మాత్ర‌మే మాస్కులు పెట్టుకోలేదు. గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో జ‌రిగిందీ స‌మావేశం. ఆ ప్రతినిధులంతా వాళ్ల పార్టీ వ్యాపారులే అనుకోండి అది వేరే విషయం. అయితే, ఆ మీటింగ్ లో ఉన్న వారంతా మాస్కులు పెట్టుకుంటే.. రాష్ట్రానికే చీఫ్ సెక్ర‌ట‌రీ.. మీరు మాత్రం మాస్క్ లేకుండా ఉండ‌టం ఏమాత్రం క‌రెక్ట్ చెప్పండి.. సీఎస్ గారూ.. మిమ్మ‌ల్నే అడిగేది....

గ‌తంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఓసారి కొవిడ్ సోకింది. పాజిటివ్ వ‌చ్చిన రెండు రోజుల‌కే ఓ రివ్యూ స‌మీక్ష నిర్వ‌హించారు. ఆ మీటింగ్‌కు మాస్క్ లేకుండా వ‌చ్చారు. ఆ ఘ‌ట‌నపై అప్ప‌ట్లో తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంత జ‌రిగినా.. ఆయ‌న తీరు ఏమాత్రం మారిన‌ట్టు లేదు. పెద్ద సారుకు మాస్క్ పెట్టుకోవ‌డం అస‌లేమాత్రం ఇష్టం ఉండ‌దు కాబోలు. లేటెస్ట్‌గా మారోసారి మాస్క్ లేకుండానే ద‌ర్శ‌న‌మిచ్చారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఎందుకైనా మంచిది, నో మాస్క్‌.. నో ఎంట్రీ.. బోర్డులు మీ ఆఫీసుల్లో కూడా పెట్టుకోండి సార్లూ.. అయినా ఓ డౌట్‌.. మాస్క్ లేక‌పోతే వెయ్యి రూపాయ‌ల ఫైన్ వేస్తారుగా.. మ‌రి, ఈ పెద్దోళ్ల‌కు కూడా వేస్తారా?

ఇక, సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవ‌ల బాగా బిజీగా ప‌ని చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పోస్టింగ్స్ అన్నిటినీ హ‌డావుడిగా క్లియ‌ర్ చేస్తున్నారు. ఆ హ‌డావుడిలో త‌ప్పులు సైతం దొర్లుతున్నాయ‌నుకోండి. జూనియ‌ర్ల కింద సీనియ‌ర్లకు పోస్టింగ్ ఇచ్చి.. ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకొని.. ఇచ్చిన జీవోల‌ను మ‌ళ్లీ స‌వ‌రించి.. ఇలా ఆగ‌మాగం అవుతున్నారు. 

మ‌రోవైపు, ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. జీతం ఇస్తూ పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉంచితే.. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేసిన‌ట్టేన‌ని గ‌ట్టిగానే చెప్పింది. ఆ మొట్టికాయ‌ల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిందో ఏమో.. రెండు మూడు రోజులుగా సీఎస్ సోమేశ్ కుమార్‌.. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. దాదాపు ఓ 30 మందికి బాధ్య‌త‌లు ఇచ్చారు. ఆ క‌స‌ర‌త్తు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సీఎస్ గారూ మీరు చేయాల్సిన ప‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చేసేస్తే.. ఇంత హ‌డావుడి ప‌డాల్సిన ప‌ని ఉండేది కాదుగా..అంటున్నారు. హైకోర్టు చెబితే గానీ.. మీరు ప‌ని చేయ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంతైనా.. సోమేశా.. మ‌జాకా...! అజ‌య్ గారూ.. నామా గారూ.. మీరు కూడా..!!