సెకండ్ బేబి కోసం స్కెచ్ ఇలా..!!

పెళ్ళైన ప్రతి జంట పిల్లల్ని కనడం అనేది కామన్. అయితే మొదటి బిడ్డను కనడం కంటే రెండవ బిడ్డను కనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొదటిసారి తల్లిదండ్రులు అయ్యేటప్పుడు పేరెంట్స్ నుండి మంచి అటెన్షన్ ఉంటుంది. పైగా ఆర్థిక స్థితి కూడా మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. కానీ రెండవసారి పిల్లల్ని కనేటప్పుడు ఆర్థిక స్థితి గురించి, పరిస్థితుల గురించి మాత్రమే కాకుండా మానసిక స్థితుల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. మానసిక స్థితి గురించి ఆలోచించడం ఏంటి అనే అనుమానం వస్తే అన్నిటికీ సమాధానమే ఇప్పుడు తెలుసుకోబోయేది.


కమర్షియల్ స్టేటస్!!


కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చేముందు అది కేవలం కొన్నిరోజుల సంబరం కాదు. అది జీవితకాల బాధ్యత అని విషయాన్ని ఆలోచించాలి. చాలామంది పిల్లల్ని కనేసి ఆ తరువాత ఖర్చులను చూసి చిరాకు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళు ఈ విషయంలో చాలా ఆలోచన చెయ్యాలి. పిల్లలుగా ఉన్నప్పుడు అయ్యే ఖర్చులే కాకుండా పెరిగే కొద్దీ పిల్లల అవసరాలు, చదువులు మొదలైన వాటి గురించి కూడా ఆలోచించాలి.


 మెంటల్ స్టేటస్!!


సాధారణంగా చాలామంది మెంటల్ స్టేట్స్ గురించి ప్రస్తావిస్తే బిడ్డను మోసే మహిళ మానసికంగా సన్నద్ధంగా ఉందా లేదా అనే విషయం చూసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అప్పటికే ఒకసారి బిడ్డను మోసి ఉంటారు కాబట్టి మళ్ళీ బిడ్డను కనడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, మొదటి ప్రసవంలో ఎలాంటి చేదుఅనుభవాలు లేకపోతే తప్ప రెండవసారి బిడ్డను కనడానికి అయిష్టత చూపించరు.


అయితే ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం కూడా ఉంటుంది. అదే కుటుంబంలో అప్పటికే ఉన్న చిన్న మనసు మానసిక పరిస్థితి. 


ప్రాధాన్యత మారిపోవడం!!


మొదటిసారి బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ ఆ బిడ్డ చాలా అపురూపం అయిపోతుంది. ప్రతిదీ బిడ్డకోసమే అన్నట్టు అన్ని చేసుకుపోతారు. కానీ ఒక్కసారిగా మరొక బుల్లి బుజ్జాయి ఇంట్లోకి రాగానే అందరి అటెన్షన్ ఆ చిన్న ప్రాణం దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటివరకు తనకే అటెన్షన్ ఇచ్చిన వాళ్ళు వేరే దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టేసరికి తెలియకుండానే అయిష్టత, తనకు ఇంపోర్టెన్స్ తగ్గించారనే కోపం, అందరూ అక్కడే ఉంటున్నారని జెలసి ఫీలవడం మొదలైనవి జరుగుతాయి. అది మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏది అడిగినా కాదనకుండా అమర్చిపెట్టిన వాళ్ళు కాస్తా అందులో భాగం చేసి చెల్లికో, తమ్ముడికో పెట్టడం లేదా నువ్వు ఇప్పుడు పెద్ద కాబట్టి తమ్ముడి కోసం, చెల్లి కోసం ఇవ్వాలి అని చెప్పడం పిల్లల్లో చెప్పలేనంత మానసిక సమస్యలను సృష్టిస్తుంది.


మరేం చెయ్యాలి??


ఆర్థిక స్థితి గురించి ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఇంట్లో ఉన్న పిల్లల మానసిక స్థితి గురించి కూడా ఆలోచన చెయ్యాలి. తమ్ముడు లేదా చెల్లి వస్తారు నీకోసం అనే మాటలు పిల్లలతో చెబుతూ ఉండాలి. దాని వల్ల పిల్లాడిలో నా తమ్ముడు, చెల్లి అనే ఫీలింగ్ ఇంకా బాధ్యత ఏర్పడతాయి. 


ప్రసవం తరువాత కూడా పెద్ద పిల్లలను పట్టించుకోకుండా ఎప్పుడూ చిన్న పిల్లల దగ్గర గడపకూడదు. పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఎక్కువ ఉన్నా దాన్ని పెద్ద పిల్లలతో కలసి తల్లిదండ్రులు పంచుకోవాలి. ఆ చిన్న పిల్లాడికి లేదా పాపకు పెద్దలు మాత్రమే కాదు నువ్వు కూడా అవసరమే అనే విషయాన్ని తెలియజేయాలి. ఇలాచేస్తే రెండవసారి ప్రసవంలో ఇంటికి వచ్చే కొత్త అతిథిని తల్లిదండ్రుల కంటే ఆ తోడబుట్టిన మనసే ఎక్కువ ప్రేమిస్తుంది.


                                   ◆వెంకటేష్ పువ్వాడ.