వైన్ షాప్స్ టైం పెంపుపై పవన్ ఫైర్..

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయంలో మార్పులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మద్యం దుకాణాలను అదనంగా మరో గంట సమయం పాటు తెరిచి ఉంచాలని జగన్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై ఆయన ఫైరయ్యారు. ఈ నిర్ణయం వైసీపీ సర్కార్ అనాలోచిత వైఖరిని బయటపెడుతోందని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. ఏపీలో ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు  తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యావసర సరుకులు ఎలా సరఫరా చేయాలి? మరింతగా మెరుగైన వైద్య సేవలు ఏ విధంగా అందించాలనే వాటిపై కార్యాచరణ తయారు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాంటిదేమీ పట్టించుకోకుండా మద్యం అమ్మకాలను ఎలా పెంచుకోవాలని దృష్టి సారించడం ఏమిటని జగన్ సర్కార్ ను పవన్ కళ్యాణ్ నిలదీశారు.

అలాగే.. రాత్రిపూట కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో తరగతులు కొనసాగింపు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ తీవ్రత తగ్గే వరకూ తరగతుల నిర్వహణను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తరగతులు నిర్వహించే ముందు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, వారిలో ఇమ్యూనిటీ ఎలా ఉందనేది పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సూచించారు.