పీఆర్సీ కిరికిరి.. పీకే టైమింగ్‌.. క‌రోనా క‌ల‌క‌లం.. టాప్ న్యూస్ @ 7pm

1. ఏపీలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయంలో మార్పులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మద్యం దుకాణాలను అదనంగా మరో గంట సమయం పాటు తెరిచి ఉంచాలని జగన్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిప‌డ్డారు. ఈ నిర్ణయం వైసీపీ సర్కార్ అనాలోచిత వైఖరిని బయటపెడుతోందని పవన్ కళ్యాణ్  దుయ్యబట్టారు. 

2. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఏపీలో ఎవరైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని టీడీపీ నేత పట్టాభి ప్ర‌శ్నించారు. జగన్‌రెడ్డి, వైసీపీ నేతలకు క్యాసినోలపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై లేదన్నారు. సీఎం జ‌గ‌న్‌ చేతగానితనం వల్లే టెస్లా కంపెనీ చేజారిపోయిందని ప‌ట్టాభి మండిపడ్డారు. 

3. పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో తాము ఆశించినట్టుగా లేదని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. తమను మళ్లీ చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. 

4. ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిప‌డ్డారు. ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం సీపీఎస్ సాధిస్తామని స్లొగన్స్ ఇచ్చిన నాయకులు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు యుద్ధం అయినా చేయాలి.. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని అశోక్ బాబు స‌వాల్ చేశారు. 

5. 317జీవోను సవరించే వరకు సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తలుచుకుంటే గ‌తంలో ఏమైందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని హెచ్చరించారు. కార్పొరేట్ స్కూల్స్‌ నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లిషు మీడియం అంటున్నారని విమ‌ర్శించారు. 

6. ఇంగ్లీష్ మీడియంపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా కేజీ టూ పీజీ సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు.

7. కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్‌ ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టింగ్ ఇవ్వకుండానే జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు. పని చేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృధా అయినట్టేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

8. తెలంగాణ‌లో కరోనా బారిన పడుతున్న వారిలో పోలీసులూ పెద్ద సంఖ్య‌లో ఉంటున్నారు. హైద‌రాబాద్‌ వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్‌ స్టేషన్లలో మొత్తంగా 65 మందికి పైగా కొవిడ్‌ బారినపడ్డారు. పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్‌ బారినపడటంతో స్టేషన్ ద‌గ్గ‌ర‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 

9. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 7వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 6,996 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. కొవిడ్‌తో న‌లుగురు చ‌నిపోవ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

10. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండింది. 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు.. ఆర్టీసీకీ 107 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.