రామోజీని ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారా?
posted on Oct 19, 2015 8:44PM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తను ఎంతో తీవ్రంగా వ్యతిరేకించే ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును కొన్ని రోజుల క్రితం స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి కలిసి వచ్చేరు. అయితే అందుకు కారణం ఏమిటో ఇంతవరకు వారిరువురూ బయటపెట్టలేదు. అదేవిధంగా వారి సమావేశం గురించి తెదేపా నేతలు కూడా ఏమీ మాట్లాడలేదు. అసలు వారిరువురూ కలిసి మాట్లాడుకొన్న సంగతి తమకి తెలియదన్నట్లే వ్యవహరించారు. కానీ వారి సమావేశం గురించి అనేక కోణాలలో విశ్లేషించిన మీడియా రామోజీరావు క్రమంగా తెదేపా దూరం అవుతున్నందునే ఆయనతో తన శత్రుత్వాన్ని పక్కనబెట్టి జగన్ స్వయంగా వెళ్లి రామోజీరావుతో చేతులు కలిపేందుకు సిద్దపడ్డారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎవరి అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ తెదేపాకు రామోజీరావుకి మధ్య దూరం పెరిగిందని ప్రజలు నమ్మేలా చేసింది ఆ సంఘటన. అంతే కాదు రామోజీతో జగన్ సమావేశం అవడం ద్వారా తెదేపా నేతల్లో ఆయన పట్ల అనుమాన బీజాలు నాటగలిగారని చెప్పవచ్చును.
తమ సమావేశం గురించి రామోజీరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏమయినా సంజాయిషీలు ఇచ్చుకొన్నారో లేదో తెలియదు కానీ ఆ తరువాత ఆయన, తెదేపా, వైకాపా నేతలు అందరూ అసలు ఆ సమావేశం జరగనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆయనని ఆహ్వానిస్తారా లేక తన మంత్రులను పంపించి ఆహ్వానిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డిలాగా దుందుడుకుగా వ్యవహరించే వ్యక్తీ కాదు...తొందరపడి నోరు జారే వ్యక్తి అసలే కాదు. అసలు ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తూ ఆయనే స్వయంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావును శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడంతో అందరి అనుమానాలు తీరిపోయాయి. వైకాపా నేతలు బహుశః మళ్ళీ ఇప్పుడు ఇదే పాయింటు లేవనెత్తి ఈనాడు మీడియా అధినేతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించినపుడు సాక్షి మీడియా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎందుకు ఆహ్వానించరు? అని ప్రశ్నించవచ్చును. బహుశః తెదేపా వద్ద అందుకు సమాధానం సిద్దంగానే ఉండి ఉందవచ్చును.