పట్టాభికి 14 రోజుల రిమాండ్‌.. జైలుకు త‌ర‌లింపు.. కోర్టులో హోరాహోరీ వాద‌న‌లు..

సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ అరెస్ట్‌తో బుధ‌వారం రాత్రి తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.  పోలీసులు ప‌ట్టాభి ఇంటి త‌లుపులు బ‌ద్ద‌ల‌గొట్టి.. ఇంట్లోకి జొర‌బ‌డి.. బ‌ల‌వంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయ‌న్ను తోట్లవల్లూరు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. తోట్ల‌వ‌ల్లూరులోకి బ‌య‌టివారెవ‌రూ రాకుండా పోలీసులు క‌ట్ట‌డి చేశారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ‌.. ప‌ట్టాభిని గురువారం మ‌ధ్యాహ్నానికి విజ‌య‌వాడ తీసుకొచ్చారు. సాయంత్రం మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పట్టడంతో ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది కోర్టు.    

అరెస్టుకు ముందు ప‌ట్టాభి రిలీజ్ చేసిన వీడియో సంచ‌ల‌నంగా మారింది. పోలీస్ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టే అవ‌కాశ‌ముంద‌నే అనుమానం వ్య‌క్తం చేశారు. ప‌ట్టాభి వీడియో రిలీజ్ చేసినందుకో ఏమో కానీ, పోలీసులు త‌న‌ను కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టారు. పట్టాభి మాట్లాడుతూ.. సీఎంను గాని, ప్రభుత్వం పెద్దలనుగానీ తాను తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను మాత్ర‌మే ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. 

పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకొని.. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.