లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారా?.. టీడీపీ నేత‌ బ్ర‌హ్మం అరెస్ట్‌, రిమాండ్‌తో హైటెన్ష‌న్‌..

ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. స్టేట్ స్పాన్స‌ర్డ్ టెర్ర‌రిజం బీభ‌త్సం సృష్టిస్తోందని స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వెల్లువెత్తుతోంది. టీడీపీ నేత‌లంతా డీజీపీని, పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏకంగా 36 గంట‌ల దీక్ష చేస్తున్నారు. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ రౌడీల దాడి ఘ‌ట‌న‌పై ఇంత ఆగ్ర‌హం, నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. ఖాకీల వైఖ‌రి ఏమాత్రం మార‌డం లేదు. మంగ‌ళ‌గిరి ఆఫీసు దాడి ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌ను కూడా అరెస్ట్ చేయ‌ని పోలీసులు.. అదే ఘ‌ట‌న‌లో టీడీపీ వారిపై మోపిన కేసుల్లో మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. టీడీపీని వేధించే చ‌ర్య‌లు మాత్రం అంతే దూకుడుగా కొన‌సాగిస్తున్నారని అంటున్నారు.

టీడీపీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. బ్ర‌హ్మంకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో నాదెండ్ల బ్ర‌హ్మంపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఆ కేసులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. 

బుధవారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారమంతా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పారు. గురువారం ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించ‌డంతో బ్ర‌హ్మంను గుంటూరు స‌బ్ జైలుకు త‌ర‌లించారు. అరెస్టు అనంతరం పోలీసులు తనను తీవ్రంగా దూషించారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ త‌న‌ను కొట్టారని బ్రహ్మం న్యాయమూర్తికి ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. 

ఇక ఆర్‌.ఐ స‌క్రూనాయ‌క్‌ను టీడీపీ ఆఫీసులో నిర్బంధించార‌నే కేసులో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ను ఏ1గా చేర్చారు పోలీసులు. ఏ6గా ఉన్న నాదెండ్ల బ్ర‌హ్మంనే అరెస్ట్ చేసి, జైలుకు త‌ర‌లించి.. ప‌రోక్షంగా లోకేశ్‌ను బెదిరింపుల‌కు గురి చేసేలా పోలీసుల చ‌ర్య‌లు ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దాడి చేసిన వారిని ఇంత వ‌ర‌కూ అరెస్ట్ చేయ‌కుండా.. బాధితుల‌పైనే కేసులు పెట్టి జైలుకు పంపించ‌డం జ‌గ‌న్ పాల‌న‌తో పోలీసు వ్య‌వ‌స్థ ఎంత‌లా ప‌త‌న‌మైంద‌నే విష‌యం చెప్ప‌డానికి ఇది మ‌రో నిద‌ర్శ‌నం అంటూ మండిప‌డుతున్నారు. మ‌రి, ఏ6 నాదెండ్ల బ్ర‌హ్మంను అరెస్ట్ చేసిన‌ట్టే.. ఏ1గా కేసు న‌మోదు చేసిన నారా లోకేశ్‌నూ అరెస్ట్ చేసే సాహ‌సం పోలీసులు చేస్తారా? అలా జ‌రిగితే టీడీపీ త‌ఢాకా ఏంటో చూపిస్తామంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.