సైకో రెడ్డిపైనా కేసు పెట్టాలి.. లోకేశ్‌నూ అరెస్ట్ చేస్తారా? ఇంటికో ఓటు ఎవ‌రికంటే.. టాప్ న్యూస్@7pm

1. సైకో రెడ్డిని సైతం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్‌. ‘‘జ‌గ‌న్‌రెడ్డి మీకే కాదు, మాకూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లకి బీపీ వ‌స్తే నువ్వు ఏపీలో ఉండ‌వు’’ అని లోకేష్‌ హెచ్చరించారు. తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. పార్టీ కార్యాలయంలోకి జొరబడ్డ సీఐకి కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం జగన్.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులుతాయని లోకేష్ హెచ్చరించారు. 

2. సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్‌కు న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు.. 14 రోజుల రిమాండ్ విధించింది విజ‌య‌వాడ కోర్టు. వైద్య పరీక్షల అనంతరం ప‌ట్టాభిని కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. సీఎంను గాని, ప్రభుత్వం పెద్దలనుగానీ తాను తూలనాడలేదని.. ప్రభుత్వ లోపాలను మాత్ర‌మే ఎత్తి చూపానని ప‌ట్టాభి చెప్పారు. పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయ‌న్ను మ‌చిలీప‌ట్నం జైలుకు త‌ర‌లించారు. 

3. టీడీపీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. బ్ర‌హ్మంకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో నాదెండ్ల బ్ర‌హ్మంపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఆ కేసులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. 

4. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు. వ‌చ్చే వారం రోజుల పాటు అమ‌లు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ హుజురాబాద్‌ ఇంఛార్జిల‌తో చర్చించారు రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్‌, బీజేపీల‌ లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. 

5. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న 36 గంట‌ల నిర‌స‌న‌ దీక్షకు రైతులు మద్దతు తెలిపారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీడీపీ కార్యాలయం, నేతలపై దాడిని ఖండించిన రైతు సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు. 

6. టీడీపీ కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్నామని.. ఆరా తీస్తే అతడిని డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా గుర్తించామని ప‌య్యావుల తెలిపారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులు, పాత్రదారులు ఎవ‌రో తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. డీజీపీ పాత్రపైనా విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. దాడి ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అన్ని విషయాలూ తేలుస్తామని హెచ్చ‌రించారు.

7. ఏపీలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. కరుడుగట్టిన నియంత హిట్లర్ కూడా మట్టిలో కలసిపోయారని ముఖ్యమంత్రి తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. బి.పి పెరిగితే ఆసుపత్రికి వెళతారు.. అంతేగాని టీడీపీ కార్యాలయాలపైకి, నేతల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయ‌రు.. అలా చేసే వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహించటం హేయమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన రాజకీయ అనుభవంలో ఇంత ఘోరం తానెన్నడూ చూడలేదన్నారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగంలోనూ ఉండదని మండిప‌డ్డారు.

8. సీఎం జ‌గ‌న్‌పై ఎంపీ ర‌ఘురామ విరుచుకుప‌డ్డారు. ‘‘బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా? వైసీపీ నేతలు బూతులు మాట్లాడటం లేదా? గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తులేవా? మిమ్మల్ని అనని మాటలకే మీ అత్యుత్సాహకులకు బీపీలు పెరిగిపోతే.. మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అత్యుత్సాహకులు ఏమయ్యారు?’’ అంటూ ప్ర‌శ్నించారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారంటూ ప‌రోక్షంగా డీజీపీపై మండిప‌డ్డారు. 

9. సీఎం కేసీఆర్ ఒక పిరికోడని.. అందుకే హుజురాబాద్ రావడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమ‌ర్శించారు. జనం మధ్యకు రాని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రావణ రాజ్యం పోవాలన్నారు. దేశంలోనే కేసీఆర్ చెత్త సీఎం అని సర్వేలో తేలిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించాలని.. టీఆర్ఎస్‌ను సమాధి చెయ్యాలన్నారు. ఇక బానిస బతుకులు మనకు వద్దంటూ హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు పిలుపిచ్చారు విజయశాంతి. 

10. వందేళ్ల‌లో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో మన దేశానికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులతో బలమైన రక్షణ కవచం లభించిందని ప్రధాని మోదీ అన్నారు. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌గా.. అక్టోబ‌ర్ 21 గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్టు కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు. ఈ సంద‌ర్భంగా దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు, వ్యాక్సిన్ రవాణాలో భాగ‌స్వామ్యులైన వారు, వైద్య రంగంలో నిపుణులు, టీకాలు ఇచ్చిన సిబ్బంది, తదితరులందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.