పంచాయతి నగారా దేనికోసం?

....సాయి లక్ష్మీ మద్దాల

 

 Panchayat elections, Panchayat elections in Andhra,  Panchayat elections AP

 

 

పంచాతి ఎన్నికలకు రంగం సిద్దమయింది. రెండేళ్ళ తరువాత జరుగనున్న ఎన్నికలు ప్రజలలో ఆద్యంతం ఉత్కంఠతను రేపుతోంది. మరి ముఖ్యంగా 50%మహిళలకు రిజర్వేషన్ కల్పించి మరింతగా మహిళలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు పోటీదారులు. బి. సి లు మాత్రం ఈసారి ఎన్నికలలో తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. ముందు M.P.T.C. లకు , Z..P.T.C లకు ఎన్నికలు నిర్వహించి అప్పుడు గ్రామ పంచాయతి ఎన్నికలకు వెళ్ళటం అనే సాంప్రదాయాన్ని ఎందుకు మార్చారు. ఇహ గ్రామాల విషయానికి వస్తే గత రెండేళ్లుగా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేక గ్రామీణ ప్రాంతాలు వెల వెల బోతున్నాయి.

 

నేడు గ్రామాలలో వీధిదీపాలు,తాగునీరు,రోడ్లు,పాఠశాలలు,ఆసుపత్రులు లేక అక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇవి కేవలం రెండేళ్లుగా ఉన్న సమస్యలు కావు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇది ప్రజలను ఏలుతున్న ప్రభుత్వాల నిర్వాకం. ఇప్పటికైనా ఈపరిస్థితులు చక్కబడాలంటే చిత్తశుద్ధి గల సర్పంచ్ లు కావాలి. 4,000కోట్ల పంచాయతి నిధులు ఈ ఎన్నికల అనంతరం విడుదల కానున్నాయి. కాని ఈ నిధులు సక్రమంగా ఖర్చయ్యేనా !
        

ముఖ్యంగా రిజర్వేషన్ పేరుతో కొన్ని ప్రాంతాలను ఆయా కేటగిరిల కిందకు తెస్తున్నారు. అది ఎలా ఉందంటే కొన్ని ప్రాంతాలను S.C,S.T రిజర్వేషన్ చేసి ఆయాప్రాంతాలకు ఒక్క S.C అభ్యర్ధి,ఒక్కS.T అభ్యర్ది ఉంటె వారినే ఏకగ్రీవంగా ఎన్నుకొని అగ్రవర్ణాల వారి పెత్తనమే సాగుతుంది. మహిళా రిజర్వేషన్ కింద తమ బంధువర్గంలో ని అభ్యర్ధులకు ఇప్పించుకొని వేలంపాట ద్వారా పదవులు పొందుతున్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితులలో సర్పంచులకు స్వతంత్ర నిర్ణయాధికారం ఎలాఉంటుంది?దీనిని ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించి,అరికట్టే ప్రయత్నం చేయాలి,లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు గాక తప్పదు. భారతదేశ ఆత్మ పల్లెలలోనే ఉన్నదని గాంధీజి అన్నారు. కాని నేటి పల్లెల పరిస్థితి నానాటికి దిగాజారిపోతున్నది. వ్యవసాయం మొక్కుబడిగా మారింది. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం ఎవరు,ఏమిటి ?అక్కడ కోరవడుతున్న ఉపాధి అవకాశాలు,కనుమరుగవుతున్న కులవృత్తులు.
            

ఎన్నికల వేళ నేతలందరూ గ్రామాభివ్రుద్దే తమ ధ్యేయమని,వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని,దానికోసం హరితవిప్లవమని పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఎన్నికల అనంతరం అవన్నీ గాలిలో కలిసిపోతాయి. ఫలితం ఏళ్లుగా గ్రామ సౌభాగ్యం అలా వెనుకబడే ఉంటున్నది. గ్రామాలలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా,మద్యం సౌకర్యం పుష్కలంగా ఉంటోంది. అన్నిటికి మించి ఈనాటి ఈపంచాయతి ఎన్నికలను అన్ని పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సహకార ఎన్నికల బావుటాను మళ్లి ఎగురవేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ గెలుపునే రానున్న 2014 ఎన్నికల నగారగా మ్రోగించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. కానీ ఈరోజున ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించే అన్ని పార్టీలు ముఖ్యంగా T.R.S,Y.S.R.C.P లు వారి వారి పంతాలతో తెచ్చిన ఉపఎన్నికల కారణంగా కూడా పంచాయతి ఎన్నికలు ఆలస్యమైనాయి.అన్నిటికి మించి ఒకేసారి ఉద్యోగాల ప్రకటన విడుదల చేసి,వివిధ శాఖలలో 24,078పోస్టుల భర్తీకి సంభందించి ప్రకటన జారీ చేసింది.వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లను,డైరెక్టర్లను నియమించింది. పలువురు I.A.S,I.P.S అధికారులను బదిలీ చేసింది సర్కారు.
               

మొత్తం మీద అన్ని రకాల తాయిలాలను చేతబూని ,అన్నిటికి మించి తెలంగాణ అంశాన్ని అరచేతిలో ఊరిస్తూ పంచాయతి ఎన్నికల బరిలో నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంత వాసులు ఎదురుచూసేది తమ బ్రతుకుల్లో వెలుగు కోసం. నాయకులను అందలం ఎక్కించటానికి కాదు . కానీ ఇక్కడ నాయకులు కోరుకుంటున్నది గ్రామీణాభివృద్ధి కాదు రానున్న ఎన్నికలకు తమ దారిని సుగమం చేసుకోవటానికి. ఇంకెప్పుడు ఈ దేశం బాగుపడేది.