దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్.. ద్వేషించేది బీజేపీ
posted on Nov 23, 2018 4:40PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, దేశ సుస్థిరత కాంగ్రెస్‌తో ముడిపడి ఉందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ నట్టేట ముంచిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీ ప్రత్యేక హోదా పైనే ఆయన తొలి సంతకం చేస్తారని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్ అయితే, దేశాన్ని ద్వేషించేది బీజేపీ అని, ఎటువైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. థర్డ్ ఫ్రంట్ అనేది కూలిపోయే టెంట్.. దేశంలో అలాంటి ఫ్రంట్‌కు ఎలాంటి అవకాశాలూ లేవన్నారు. ఎన్నికలకు ముందే అది కూలిపోతుందని జోస్యం చెప్పారు.