పట్టపగలే విజయవాడలో దారుణం
posted on Nov 23, 2018 3:14PM

విజయవాడలో ఓ ఫైనాన్స్ వ్యాపారిపై పట్టపగలే హత్యాయత్నానికి ఒడిగట్టారు దుండగులు. దేవరపల్లి గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారికి బీసెంట్ రోడ్డులోని మూన్‌మూన్ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో కార్యాలయం ఉంది. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయనకు 80శాతానికి పైగా గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆంధ్రా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. గగారిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన శరీరానికి మంటలు అలముకోవడం, బయటకు పరుగెత్తుకొచ్చిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆర్థికపరమైన అంశాల్లో విభేదాల వల్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు పెట్రోల్ క్యాన్‌తో పాటు కత్తిని కూడా తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెట్రోల్ పోసిన తర్వాత కత్తిని అక్కడే వదిలి వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు. మద్దాల సుధాకర్, సురేశ్ అనే ఇద్దరు వ్యక్తులకు గగారిన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో వారి ఆచూకీ తెలుసుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.