ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల కోడ్ వర్తించదా?

ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీడియా సమావేశం ఏర్పాటు కేసి మరీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ ప్రకటనతో దేశం అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు అవుతున్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైసీపీ ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పోలీసలు మాత్రం బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. ఇక ఫ్లెక్సీల తొలగింపు విషయానికి వస్తే.. పోలీసువారి పహారాతో అధికారులు సెలక్టివ్ గా తెలుగుదేశం, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. వైసీపీకి చెందిన ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నా.. ఎన్నికల సంఘం కళ్లకు మాత్రం కనిపించడం లేదు.  

అన్నిటికీ మించి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాల కంటే జగన్ మోహన్ రెడ్డి సేవలో తరించడమే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ అధికారులు జగన్ సేవ కోసం ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుందన్న బెదురు వారిలో కనిపించడం లేదు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాదన్న ధీమాయో ఏమో.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినెట్ మంత్రుల ఫొటోలను ఇంకా తొలగించలేదు.  అలాగే వైసీపీ  నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన   48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలి. అలా తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగడం లేదు. 

అంతే కాదు.. చివరికి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంపిణీ చేసే ప్యాడ్ లతో కూడా వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కోడ్ ను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్డీవో ఆ ప్యాడ్ లను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసి కూడా ఎమ్మెల్యే అనుచరుల బెదరింపులకు తలొగ్గి వాటిని ఉపంసంహరించుకున్నారని తెలిసింది.  ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.   ఏపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.