చీపురుపల్లి నుంచి పోటీకి గంటా ఓకే!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆదేశాలను శిరసావహించేందుకు గంటా సుముఖత వ్యక్తం చేశారు. తన సిట్టింగ్ సీటు భీమిలి నుంచీ కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి రంగంలోకి దిగాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు అక్కడ నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్సా సత్యనారాయణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే.

గంటా శ్రీనివాసరావు అయితేనే బొత్సాకు దీటైన అభ్యర్థి అవుతారని భావించిన చంద్రబాబు.. అక్కడ పోటీకి రెడీ కావాల్సిందిగా గంటాను ఆదేశించారు. అయితే తొలుత చీపురుపల్లి నుంచి పోటీకి నిరాకరించిన గంటా శ్రీనివాసరావు, బీమిలి నుంచే మరోసారి పోటీ చేస్తానని అధిష్ఠానాన్ని కోరారు. చీపురుపల్లిలో  తన విజయావకాశాలపై కొంత సందేహం ఉండటంతో గంటా అందుకు నిరాకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చీపురుపల్లిలో విస్తృతంగా సర్వే చేయించిన చంద్రబాబు చీపురుపల్లిలో గంటా విజయం సునాయాసమే అని చెప్పి ఆయనను ఒప్పించినట్లు చెబుతున్నారు.

సో.. చీపురుపల్లి నుంచి గంటా పోటీ ఖరారైన నేపథ్యంలో ఇక ఉత్తరాంధ్రలో అన్ని సీట్లకూ అభ్యర్థల ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు భీమిలి నుంచి పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  విశాఖ జిల్లా మొత్తంలో ఇంకా భర్తీ కాని సీటు ఏదైనా ఉందంటే అది భీమిలి ఒక్కటే కావడంతో ఆ స్థానంలో పోటీ చేయడానికి పార్టీ టికెట్ కోసం కొర్రోతు బంగార్రాజు సహా పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొర్రోతు బంగార్రాజు నెల్లిమర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో ఇప్పుడు భీమిలి నుంచి పోటీలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే పార్టీ అధినేత  ఎవరిని భీమిలి నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తారన్నది చూడాల్సిందే.