జగన్, కేటీఆర్ నోట ఉమ్మడి రాజధాని మాట.. వ్యూహత్మకమా.. కాకతాళీయమా?

ఎన్నికల వేళ  ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే ఐదేళ్ల అస్తవ్యస్థ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అర్ధం కాక మల్లగుల్లాలు పడుతోంది. 
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని విషయంపై అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ గళమెత్తుతున్నాయి. ఇది కాకతాళీయమా లేక ఉమ్మడి వ్యూహమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎన్నికల అంశంగా తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరో వైపు ఇదే ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి జగన్ సర్కార్ కారణమన్న విమర్శ నుంచి బయటపడవచ్చన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. రెండూ పార్టీల నుంచీ ఒకే వాదన ఒకే సారి తెరమీదకు రావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది.

ఎందుకంటే వైసీపీ, బీఆర్ఎస్ లు రెండూ ఫ్రెండ్లీ పార్టీలు. పరస్పరం సహకారం అందిం చుకుం టుంటాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏపీ సీఎం జగన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ కోసం సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ పోలీసులను పంపించారు. అది కేసీఆర్ కు పెద్దగా ఉపయోగపడలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో మళ్లీ జగన్ సర్కారే కొలువుదీరనున్నదని జోస్యాలు చెబుతున్నారు. ఇది జగన్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. పరస్పర సహకారం కోసం రెండు పార్టీలూ, రెండు పార్టీల అధినేతల తహతహలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కారణమేమిటంటే రెండు రాష్ట్రాలలోనూ ఏకకాలంలో ఇాద్దరు శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు) ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరువురికీ ఇబ్బంది కరమైన విషయమే అనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే  వేములవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆదివారం (ఏప్రిల్ 28) మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు. 

మరో వైపు సోమవారం (ఏప్రిల్ 29)చోడవరంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్, వైసీపీలు కూడబలుక్కునే ఉమ్మడి రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చాయని అటున్నారు. 

ఏకకాలంలో అటు బీఆర్ఎస్ కూ, ఇటు వైసీపీకీ ఉమ్మడి రాజధాని అంశం గుర్తుకురావడంపై అటూ ఇటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాజధానిని ఆపగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అం టూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో  తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలేమిటన్న విమర్శలు వస్తుంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడడమేమిటని నిలదీస్తున్నారు. మొత్తం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, వైసీపీలు  వ్యూహాత్మకంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.