మంగళగిరిలో లోకేష్ మ్యాజిక్!.. అనుమానం లేదు విజయం చినబాబుదే!

మంగళగిరి.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్ అనడంలో సందేహం లేదు. ఔను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టీ మంగళగిరి నియోజకవర్గంపైనే ఉంది. 
నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో  ఏ పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు పార్టీల పరిస్థితి ఏమిటన్న ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విజయం పక్కా అన్నదే అందరి భావన.  వాస్తవానికి మంగళగిరి ఎప్పడూ తెలుగుదేశం పార్టీకి ఫేవరెట్ సీటు కాదు. నియోజకవర్గం ఆవిర్భావం తరువాత.. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1985 తరువాత మంగళగిరి నియోజవకర్గంలో తెలుగుదేశం గెలిచింది లేదు.  

అలాంటి అంటే తెలుగుదేశంకు అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గం నుంచి నారా లోకేష్   ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. అవును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం అధినేత తనయుడిగా గత ఎన్నికలలో లోకేష్ పోటీ చేయదలచుకుంటే పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాన్ని ఎన్నికుని పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. లోకేష్ మాత్రం సవాల్ స్వీకరించేందుకే మొగ్గు చూపారు. పార్టీకి అంతగా అనుకూలం కాని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నికుని ఆయన 2019 ఎన్నికలలో పోటీకి దిగారు. అలా దిగడం ద్వారా లోకేష్  ఎలాంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చాటారు. ఆ ఎన్నికలలో పరాజయం పాలైనా, వెనకడుగు వేయలేదు.  నియోజకవర్గాన్ని వదలలేదు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  మామూలుగా అయితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూసి, అక్కడ నుంచి ఒకసారి ఓటమి పాలై కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే టన్నలు కొద్దీ ధైర్యం ఉండాలి.  ప్రజలను ఆకట్టుకుని ఓడిన చోటే విజయకేతనం ఎగురవేయగలనన్న ధీమా ఉండాలి. మంగళగిరి నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికలలో పోటీకి రెడీ అవ్వడం ద్వారా ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ రుజువు చేసుకున్నారు.   ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమైన తీరు గమనించిన పరిశీలకులు ఇప్పుడు తెలుగుదేశం గెలుపు గ్యారంటీ స్థానాలలో మంగళగిరిని మొదటి స్థానంలో చెబుతున్నారు.  గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.  

పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చి మూడో అభ్యర్థిని తెరపైకి తీసుకురావడాన్ని చూపుతున్నారు.  స్వయంగా వైసీపీ అధినేత జగన్  దృష్టి పెట్టి గెలుపు గుర్రాలంటూ ఒకరిని  కాదని మరొకరిని మంగళగిరి అభ్యర్థిగా మార్చి మార్చి ప్రకటిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆకాశమే హద్దుగా హామీలు గుప్పిస్తున్నా  ఇక్కడ వైసీపీ నుంచి వలసలు వరదల్లా పెరుగుతున్నాయి.  

మంగళగిరిని అగ్రస్థానంలో నిలపడమే  లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు సైతం  పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. ఇక జనం అయితే ఎప్పుడో లోకేషే మా ఎమ్మెల్యే అన్న నిర్ణయానికి వచ్చేశారు.    అంతేనా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు వస్తున్న వారి సంఖ్య  మేడారం జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారంటే లోకేష్ నియోజకవర్గంపై ఎంతటి ప్రభావం చూపారో అర్ధం అవుతోంది.  

మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని  నారా లోకేష్  చెబుతున్న మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.  తండోపతండాలుగా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవడానికి జనం తరలి వస్తున్నారు. ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరిలో వైసీపీకి క్యాడర్ మిగిలే అవకాశాలూ అనుమానమేనని అంటున్నారు.  అయినా లోకేష్ క్షణం విశ్రమించడం లేదు. తటస్థులను మర్యాదపూర్వకంగా కలుస్తూ,  మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికను వివరిస్తున్నారు.   

తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని ఆయన చెబుతున్న మాటలు విశ్వసిస్తున్నారు.  పరిశీలకులు మంగళగిరిలో లోకేష్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమాన్ని చూసి నియోజకవర్గంలో లోకేష్ మ్యాజిక్ చేశారని విశ్లేషిస్తున్నారు.