9 నెలల పిల్లోడు హత్య చేయబోయాడట!

 

 

 

పాకిస్తాన్ పోలీసులకు మైండ్ మోకాలిలో వుంటుందన్న అభిప్రాయానికి బలం చేకూర్చే సంఘటన లాహోర్‌లో జరిగింది. లాహోర్‌లోని ఒక ఏరియా పోలీసులు తొమ్మది నెలల వయసున్న మూసా అనే బాలుడి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ పిల్లగాడు హత్యాయత్నం చేసింది ఎవరిమీదో కాదు.. సాక్షాత్తూ పోలీసుల మీదేనంట. ఈ మేరకు ఆ పసికందు, అతని తండ్రితోపాటు పాతిక మంది మీద పోలీసులు హత్యాయత్నం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

వీళ్ళందరినీ కోర్టుకు హాజరుపరచడంతో జడ్జి బెయిల్ మంజూరు చేసి, తొమ్మిది నెలల బాలుడు పోలీసుల మీద హత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ బాలుడినే కనుక్కుని స్టేట్‌మెంట్ రికార్డు చేయండని ఆదేశాలు జారీ చేశారు. తొమ్మది నెలల బాలుడి మీద  హత్యాయత్నం కేసయితే పెట్టాం గానీ, మాటలే రాని అతని స్టేట్‌మెంట్ ఎలా  రికార్డు చేయాలో అర్థంకాక పోలీసులు జుట్టు పీక్కున్నారు. ఈలోగా పోలీసు ఉన్నతాధికారులకు ఈ కేసు విషయం తెలిసి, పసికందు మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ ఎస్ఐని సస్పెండ్ చేసేశారు. మూసా మీద కేసు ఎత్తేశారు. 



ఇంతకీ జరిగింది ఏంటంటే, లాహోర్‌లోని ఓ మాస్ లొకాలిటీలో జనం కరంట్ సరిగా వుండటం లేదని ఆందోళన చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు వస్తే వాళ్ళమీద ఓ పాతికమంది దాడి చేశారు.  దాడి చేసిన వాళ్ళలో మూసా తండ్రి ఇర్ఫాన్ తరార్ కూడా వున్నాడు. దాడి చేసిన సమయంలో ఇర్ఫాన్ తరార్ చంకలో తొమ్మిది నెలల కొడుకు మూసా కూడా వున్నాడు. దాంతో పోలీసులు తమమీద దాడిచేసిన గ్రూప్‌లో మూసా కూడా వున్నాడు కాబట్టి మూసా మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టి కోర్టుకు లాగారు. అదీ విషయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu