మధు యాస్కి బొచ్చెలో బిజెపి రాయి!
posted on Apr 4, 2014 5:57PM

మధు యాస్కి అమెరికా వెళ్ళి హోటళ్ళ వ్యాపారం చేయొచ్చుగానీ, సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండకూడదు. ఈతరహా ఆలోచనా విధానం వున్న మధు యాస్కి నిజామాబాద్ ఎంపీ అయినప్పటి నుంచి తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని తిరగడమే తప్ప నియోజకవర్గానికి ఒరగబెట్టింది సున్నా. ఎంపీగా ఫెయిలైన మధు యాస్కి ఈసారి గెలవటం డౌటేనన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఓడిపోతానని తెలిసినా మధు యాస్కి మళ్ళీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాను ప్రజలకు చేసిన సేవ ఏమీ లేకపోయినా తనకరుగట్టిన తెలంగాణ వాదాన్ని అడ్డంగా పెట్టుకుని ఓట్లు అడగాలని ఆయన అనుకుంటున్నారు. అయితే మధు యాస్కికి అనుకోని అవాంతరం వచ్చిపడింది.
ఇప్పటి వరకూ నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు యెండల లక్ష్మీ నారాయణ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆల్రెడీ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రజల్లో మంచి పేరు, సేవకుడిగా మంచి గుర్తింపు వున్న లక్షీనారాయణను ఎదుర్కోవడం మధు యాస్కి వల్ల కాదని, అందువల్ల మధు యాస్కి ఈసారి ఓడిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీమాంధ్రులను అన్యాయంగా తిట్టిపోసిన పాపం మధు యాస్కిని ఊరకే వదులుతుందా?