ముచ్చటగా మూడవసారి సిద్దూకు శృంగభంగం
posted on Feb 7, 2022 12:23PM
కొంచెం ఆలస్యంగానే అయినా, కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దూ, దురహంకారానికి బ్రేకులు వేసింది. ముఖ్యమంత్రి రేసులోంఛి ఆయన్ని తప్పించి, ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఒకసారి కాదు, కాంగ్రెస్ అధిష్టానం వరసాగా మూడవ సారి కూడా, ముఖ్యమంత్రి రేసులోంచి సిద్దూను పక్కకు నెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్’ ని పొమ్మన కుండా పొగ పెట్టి బయటకు పంపడంలో, సిద్దూ సక్సెస్ అయ్యారు. అయితే, తానే కెప్టెన్ (ముఖ్యమంత్రి) కావాలనే కోరిక మాత్రం నెరవేరలేదు.
నిజానికి, గత కొంత కాలంగా, మరీ మాట్లాడితే, ఐదేళ్ళ క్రితం అమరేందర్ సింగ్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి సిద్దూ కారణంగానే పంజాబ కాంగ్రెస్ పార్టీలో వరస సంక్షోభాలు తలెత్తుతున్నాయి.
2017 ఎన్నికల సమయంలోనే సిద్దూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు అయితే సీనియారిటీ ప్రాతిపదికానో లేక ఇతర కారాణాల వలన చేతనో కాంగ్రెస్ పార్టీ కెప్టెన్’ వైపు మొగ్గుచుపింది. కెప్టెన్ కాబినెట్’లో సిద్దూ కొద్దికాలం మత్రిగా ఉన్నారు .. ఆతర్వాత రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెప్టెన్, సిద్దూల మధ్య వార్, నడుస్తూనే ఉంది.అయినా అంతగా పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం, ఈ మధ్య కాలంలో కారణాలు ఏవైనా, కెప్టెన్’ను తొలిగించి చన్నీకి ముఖ్యమంత్రి పదవినీ, సిద్దూకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఇక అక్కడి నుంచి అసలే కోతి ఆపైన కల్లు తాగింది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఇటు పార్టీకి, ఆటు ముఖ్యమంత్రి చన్నీకి తలనొప్పిగా మారారు.
అయినా ఇంతకాలం అన్నీ భరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు సమయం చూసి సిద్దూకు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో సిద్దూ లేవనెత్తిన వివాదానికి, ఆప్ అధ్యక్షుడు కేజ్రివాల్ చూపిన బాటలో జనాభిప్రాయం పేరున, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని రాహుల్ గాంధీ ప్రకటించారు.
అయితే, సిద్దూ సామాన్యుడు కాదు,ఏ క్షణానికి ఏమి చేస్తారో తెలియదు. ఒక వేళ ప్రస్తుతానికి సర్దుకు పోయినా, రేపు అన్నీ అనుకూలించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ... మళ్ళీ సిద్దూతో ముఖ్యమంత్రి చన్నీకి, అదే విధంగ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పవని పరిశీలకులు అంటున్నారు. అయితే, రేపటి సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతాని చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. దళిత నేత అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి కొద్ది కాలమే అయినా మంచి పాలనతో ప్రజల్ని ఆకట్టుకున్నారు.అందుకే రాహుల్ గాంధీ, సిద్దూను బుజ్జగిస్తూనే చన్నీ పేరును ప్రకటించారు. ఇక సిద్దూ ఏమి చేస్తారో ... చూడవలసి ఉందని అంటున్నారు.