ఈ పసివాణ్ని చంపడానికి ఇంత పెద్ద స్కెచ్చా?

పన్నెండేళ్ల పసివాణ్ని చంపడానికి దాదాపు 10 మంది ఒక్కటయ్యారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారనుకోండి. అది వేరే విషయం. కానీ అంతటి పసివాణ్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో ఎవరూ ఊహించలేకపోయారు. కామారెడ్డి జిల్లాలో అభం శుభం ఎరుగని 12 ఏళ్ల బాలుణ్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. పొలంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్యను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. హత్యా స్థలంలో దొరికిన ఆనవాళ్ల సాయంతో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నాగిరెడ్డి పేట మండలం మాటూరు మాసంపల్లి శివారులో 12 ఏళ్ల సురేశ్ అనే అబ్బాయిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. బాలుడి ఒంటిమీద ఉన్న గాయాల్ని బట్టి చిత్రవధ చేసి చంపినట్టు అర్థమవుతోంది. బండరాళ్లతో మోది, బలవంతంగా ప్రాణాలు తీశారు.

అక్కంపల్లి గ్రామానికి చెందిన రాములు-సాయవ్వ దంపతుల కుమారుడత సురేష్. ఉపాధి కోసం వారు ఆర్మూర్ కు వలస పోగా... కుమారుడు సురేశ్ ను నానమ్మ పోశవ్వ వద్ద వదిలివెళ్లారు. కొంత కాలంగా నానమ్మ వద్ద ఉంటున్న సురేష్... ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి పందుల వేట కోసం వెళ్ళాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. పిల్లలు బయటికి వెళ్లిన తరువాత మాసం పల్లి శివారులోని గండి వద్ద పొలంలో.. రక్తపు మడుగులో సురేష్ పడి ఉన్నట్టు కబురు అందడం కలకలం సృష్టించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్వ్కాడ్ ను ఉపయోగించి దర్యాప్తు చేశారు. ఫలితంగా పోలీసులు 9 మందిని ఇప్పటికి అరెస్టు చేశారు.

ఇక మృతుని తండ్రి రాములుకు ఇతరులతో ఉన్న పాతకక్ష్యలతోనే సురేష్ ను దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. తండ్రి రాములు చెబుతున్నది కూడా సరిగ్గా సరిపోలుతోంది. తనతో ఉన్న వ్యక్తిగత కక్షలు, భూ తగాదాల కారణంగా వారే కుమారుణ్ని చంపి ఉంటారని తండ్రి అనుమానిస్తుండడంతో విషంలో క్లారిటీ వచ్చింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu