జూబ్లిహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలెంత?
posted on Oct 9, 2025 12:52PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నవీన్ యాదవ్ బలమైన నేత కావడం వల్లే.. ఆయనపై కేసులు పెడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ కి, నవీన్ కి ఉన్న గెలుపు అవకాశాలెన్ని అన్న చర్చ అయితే ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిన్నా, మొన్నా అని కాదు.. గత కొన్నేళ్లుగా ఆయనీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. పండగేదైనా సరే ఈ సెగ్మెంట్ లో గత కొన్నాళ్లుగా నవీన్ యాదవ్ హడావిడి హంగామా కనిపిస్తోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో సామూహిక శీమంతాలు జరిపించారు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ విద్యావంతుడైన యువకుడు కూడా కావడంతో యూత్ ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఎంత పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్నా కూడా నవీన్ యాదవ్ కు రెండుమూడు అంశాల్లో మాత్రం సవాళ్లు ఎదురౌతున్నాయి. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అందుకే ఇక్కడ గత ఎన్నికల్లో గోపీనాథ్ పై అజారుద్దీన్ ను నిలబెట్టింది కాంగ్రెస్. కానీ ఎందుకనో తెలీదు గత కొంత కాలంగా ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి తోడు కాంగ్రెస్ సైతం మైనార్టీల్లో ఎవరికీ ఇంత వరకూ మంత్రి పదవి ఇవ్వలేదు. అజర్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై హోం మంత్రిత్వం ఆయనకు కట్టబెడతారన్న మాట వినిపించింది. ఈ ఎన్నికలకన్నా ముందే కాంగ్రెస్ ఆపని చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అలా చేయలేదు. ఇక రేవంత్ కేబినెట్ లో ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కలేదన్న అంశంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని ఎండగడుతోంది.
దానికి తోడు సిటీలో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ. ఆ ప్రభావాన్ని ఎదుర్కొని నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ లో నెగ్గుకు రావడం సాధ్యమేనా? అని రాజకీయవర్గాలు అంటున్న పరిస్థితి. వీటికి తోడు సిటీలో హైడ్రా ఎఫెక్ట్ కూడా ఎక్కువే. ప్రత్యేకించి జూబ్లిహిల్స్ సెగ్మెంట్లో హైడ్రా పెద్ద నష్టం కలిగించ లేదు. కానీ హైడ్రా ఫస్ట్ ఆపరేషన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘట్టం జరిగింది ఇక్కడే. దీంతో ఒక రకమైన కాంగ్రెస్ వ్యతిరేకత అంతర్లీనంగా ఉందీ ప్రాంతంలో. ఆ తర్వాత బీఆర్ఎస్ గతంలో ప్రవేశ పెట్టిన బస్తీదవాఖాన వంటి వాటిని కాంగ్రెస్ సరిగా నిర్వహించడం లేదన్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఇలాంటి వాటి ద్వారా కూడా నవీన్ యాదవ్ కి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. ఆపై అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా ఎదుర్కోబోతున్న మాగంటి సునీత గోపినాథ్ సతీమణి. దీంతో నవీన్ యాదవ్ సెంటిమెంటును జయించాల్సి ఉంటుంది. మహిళా ఓటర్లు ఎప్పటిలాగానే అటు వైపు మళ్లితే నవీన్ యాదవ్ ఇప్పటి వరకూ లేడీ సెంటిమెంట్ గ్రాబ్ చేయడం కోసం చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
ఇక ఫైనల్ గా కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవమే. కానీ అదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్త. అదే ఇప్పుడు పార్టీ పవర్ లోకి వచ్చి సుమారు రెండేళ్లు. ఈ కాలంలో కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. వీటన్నిటినీ తట్టుకుని నవీన్ యాదవ్ జూబ్లి కింగ్ కావల్సి ఉంది. మరి ఆయన ఓన్ చరిష్మాతో ఇన్ని వ్యతిరేకతలను పరిస్థితులను నెగ్గుకు రాగలరా? అన్నది తేలాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఈ ఉప ఎన్నిక ఫలితాలు వస్తాయి కాబట్టి.