బీహార్‌లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : తేజస్వి యాదవ్
posted on Oct 9, 2025 4:29PM

బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీనికి సంబంధించి చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. 20 నెలల్లోపు నిరుద్యోగం లేని బీహార్‌ను చూపిస్తామని స్పష్టం చేశారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగ భృతి ఇస్తోందని తేజస్వి విమర్శించారు. మరోవైపు బీహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమయ్యే విషయమే కానీ, దానికి బలమైన సంకల్పం అవసరమని అన్నారు. తమ హామీలను ఎన్డీఏ కూటమి నకలు చేస్తోందని విమర్శించారు.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఒక వైపు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, మరో వైపు ఎన్నికల వ్యూహకర్త మరియు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారు.