జగన్ అండ్ కో ఓవర్ చేస్తున్నారా?
posted on Dec 18, 2015 11:31PM

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా వైసీపీ నాయకుడు జగన్ పరిస్థితి తయారైందని రాజకీయ పరిశీలకులు భావిస్తు్న్నారు. కాల్‌మనీ వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ సక్సెస్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఇష్యూ అటు తిరిగి, ఇటు తిరిగి జగన్‌కే ఇబ్బందికరంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ అంశం మీద ఓవర్‌గా రియాక్ట్ అయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నందుకు ఆ పార్టీ నాయకురాలు రోజా సంవత్సరంపాటు సస్పెండ్ అవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో అన్ని పార్టీలవారూ వున్నారన్నది జగమెరిగిన సత్యం మాత్రమే కాదు.. జగనెరిగిన సత్యం కూడా. వాస్తవానికి ఈ అంశంలో ఏ ఒక్క పార్టీనో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. జగన్ అధికార పార్టీ వైపు వేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళూ ఆయన పార్టీనే చూపించేలా పరిస్థితి వుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం సరైన పద్ధతి అనిపించుకోదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాల్‌మనీ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైనది కాదు. ఎప్పటి నుంచో కాల్‌మనీ వ్యాపారం వుంది. కానీ, జగన్ అండ్ కో అసెంబ్లీలో వ్యవహరిస్తు్న్న తీరు మాత్రం తెలుగుదేశం పార్టీయే కాల్‌మనీ వ్యాపారానికి కారణం అని బలవంతంగా అయినా ఒప్పించాలన్నట్టుగా వుంది. నిజానికి కాల్‌మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది తెలుగుదేశం ఎంపీ అనే విషయాన్ని జగన్ మరచిపోయినట్టు నటించడం భావ్యం కాదని పరిశీలకులు అంటున్నారు. కాల్‌మనీ అనేది ఒక సామాజిక సమస్య. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నట్టుగా వుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రతి విషయాన్నీ రాజకీయం చేసే ధోరణిని విడిచిపెడితే ప్రజల్లో మరింత పలచన కాకుండా వుంటారని సూచిస్తున్నారు.